గత వారం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. అయితే ఇది రొటీన్ బదిలీ అని అనుకున్నారు.. కానీ చాలా పెద్ద కథ ఉందని మెల్లగా బయటకు వస్తోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతకం తిరగబడే వ్యవహారం ఉందని .. ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ నామినేషన్‌తో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు. దాన్ని అధికారులు అంగీకరించారు. దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
తొలి దశలోనే ఎన్నికలు జరగడంతో.. దాదాపుగా రెండు నెలల తర్వాత కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు వెబ్సైట్లో శ్రీనివాస్‌గౌడ్‌కు చెందిన కొత్త అఫిడవిట్ ప్రత్యక్ష మయింది. పాతది తొలగించారు. ఓ సారి నామినేషన్‌తో పాటు ఆమోదించిన అఫిడవిట్‌ను తొలగించడం అసాధ్యం. ఎన్నికల అధికారులు సహకరించడంతో అలా చేయగలిగారు. ఆ ఆఫిడవిట్‌తో తప్పులు తడకలు ఉండటంతో ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని గమించిన కొంత మంది ఈసీకి ఫిర్యాదు చేశారు. గత ఏడాదిలో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి వివరాలు పంపాలని శశాంక్ గోయల్‌కు కేంద్ర ఈసీ నుంచి సమాచారం వచ్చింది.
విచారణ జరిపిన గోయల్ అలా జరిగింది నిజమేనని తేల్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి ఎన్నికల అధికారిగా ఉన్న రజత్ కుమార్‌కు కూడా ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ఫ్రాడ్‌లను చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. దీంతో అటు శ్రీనివాస్ గౌడ్.. ఇటు రజత్ కుమార్ కూడా నిండా మునిగిపోయినట్లేనని భావిస్తున్నారు. రజత్ కమార్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.