గురువారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కన్నయ్య కుమార్ సభకు నేనూ హాజరయ్యాను. సభా మందిరం కిక్కిరిసి వుండటంతో బయిట నిల్చుని నాయకులు మిత్రులతో మాట్లాడుతూ గడిపాను. మల్లేపల్లి లక్ష్మయ్య అద్యక్షతన సభ మొదలై ఇతరులు మాట్లాడినంత సేపూ బాగానే వుంది. కన్నయ్య హిందీలో ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే ఇద్దరు సంఘ పరివార్ అనుయాయులు చెప్పు విసిరి వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యకర్తల అప్రమత్తత వల్ల అది తనకు తగల్లేదు గాని సభలో అలజడి రేగింది. వారు లోపలికి దూసుకువచ్చి మీడియా కెమెరా స్టాండ్లను కూడా ధ్వంసం చేశారు. తర్వాత నినాదాలతో ఉద్రిక్తత సృష్టించారు.
ఇది జరుగుతుంటే కన్నయ్య మాత్రం వారిని ఏమీ చేయకండి.. జెఎన్‌యు ఘటనలో చెంపదెబ్బలు కొట్టిన వారిని కూడా వదిలేశాం…అని కూడా అన్నారు. తర్వాత కార్యకర్తలు పోలీసులు వారిని పట్టుకుని బయిటకు తీసుకొచ్చారు. ‘భారత్ మాతాకి జై’ అని వారు అదే పనిగా నినాదాలు చేయడం కూడా వ్యూహాత్మక వ్యవహారమే అనిపించింది. ఎందుకంటే అక్కడ అప్పటి వరకూ మాట్లాడిన వారెవరూ దేశానికి జాతికి లేదా ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. మోడీ ప్రభుత్వ విధానాలను అంతకు మించి మనువాదాన్ని మతతత్వాన్ని విమర్శించారు. అయినా కావాలనే సభను భగం చేయాలని పథకం ప్రకారమే ఇదంతా చేసినట్టు స్పష్టమైంది. పోలీసులు వారిని వ్యానులో ఎక్కించుకుని తీసుకుపోయాక సభ యథావిధిగా కొనసాగింది.