హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని బయటనుంచి చూస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి ఎదురులేదు, కేసీఆర్‌కు తిరుగులేదు అనిపిస్తుంది. కానీ లోలోపల కథ వేరు. పార్టీలో అసమ్మతి రగులుతోంది. ‘బంగారు తెలంగాణ’ అనే నినాదంతో కేసీఆర్ – కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలనుంచి సీనియర్ నాయకులను, ప్రజాప్రతినిధులను ఆకర్షించటం, వారి వెనక వారి అనుచరులు ప్యాకేజిలాగా రావటంపై టీఆర్ఎస్ పార్టీలో మొదటినుంచి ఉన్న నేతలు, శ్రేణులు రగిలిపోతున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక కథనం. టీఆర్ఎస్లోకి వస్తున్న ఈ నాయకులంతా తమ ఆస్తులను, వ్యాపారాలను పరిరక్షించుకోవటంకోసం, అధికారాన్ని అనుభవించటంకోసమే వస్తున్నారని పాత నాయకులు ఆరోపిస్తున్నారట. బంగారు తెలంగాణ నినాదం కింద పార్టీనీడలోకి చేరుతున్నా ఈ నాయకులు(వీరికి బీటీ బ్యాచ్ అని పాత నాయకులు నామకరణం చేశారు) టీఆర్ఎస్కు ఏవిధంగానూ ఉపయోగపడరని కూడా అంటున్నారట. వారి రాకను జీర్ణించుకోలేకపోతున్నామని అంటున్నారట. వారివలన తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారట. ఎవరినిపడితే వారిని చేర్చుకోవద్దని అడుగుదామని అనుకుంటున్నారట. కానీ కేసీఆర్‌కు ఎదురుపడి ఈ విషయం చెప్పేటంత సీన్ వీరికి ఉండదనుకోండి!
ఏది ఏమైనా రాష్ట్రంలో మిగిలిన పార్టీలను నిర్వీర్యం చేసే లక్ష్యంగా కేసీఆర్ ఎడాపెడా ఇతరపార్టీలనుంచి నాయకులను తీసుకోవటం ఆ పార్టీకి మంచిదికాదు. ఉదాహరణకు డి.శ్రీనివాస్‌ను టీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు. ఆయన రావటంవలన ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో మూడు పవర్ సెంటర్లు అయ్యాయి. ఇప్పటికీ కవిత(ఎంపీ), పోచారం శ్రీనివాసరెడ్డి(మంత్రి) జిల్లాలో రెండు పవర్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు డీఎస్ రాకతో మూడయ్యాయి. ఇలాంటప్పుడు వివిధ స్థాయిలలో పదవుల పంపకం విషయంలో తప్పనిసరిగా విభేదాలు వస్తాయి. కొత్తనేతలపై తిరగబడాలని ఇప్పటికే ప్రతిపక్షాలనేతలు బయటనుంచి పాతనేతలను రెచ్చగొడుతున్నారు. వీటిపై కేసీఆర్ దృష్టి పడిందో, లేదో!