డబుల్ బెడ్ రూమ్ పథకం విషయంలో విపక్షాలు తమపై చేస్తున్న దాడికి.. కౌంటర్ ఎటాక్ ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రంగం సిద్ధం చేశారు. తాము కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం దీని కోసం ముహుర్తం ఖరారు చేశారు. తొలివిడతలో 1,152 మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు అందిస్తారు. జియాగూడలో 840, కట్టెలమండిలో 120, గోడేకా కబర్లో 192 ఇళ్లు పంపిణీ చేస్తారు. విడతల వారీగా.. మిగిలిన చోట్ల కట్టిన ఇళ్లను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు.
కట్టిన ఇళ్లన్నీ పంపిణీ చేసిన తర్వాత.. కట్టబోయే ఇళ్లకు లబ్దిదారుల్ని ఎంపిక చేసిన తర్వాత గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. కొద్ది రోజుల కిందట… అసెంబ్లీలో హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించుకున్నారు. దీన్నిపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. అయితే.. మంత్రి తలసాని… కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను సవాల్ చేశారు. లక్ష ఇళ్లు చూపిస్తానన్నారు. రెండు రోజులు చూసినా.. హైదరాబాద్లో నాలుగు వేల ఇళ్లు మాత్రమే కనిపించారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మధ్యలో తలసాని వెళ్లిపోవడంతో ఆ టూర్ గందరగోళంగా మారింది.
ఇప్పుడు.. ఆ ఇమేజ్ డ్యామేజ్ను.. కేటీఆర్ కవర్ చేయనున్నారు. వరుసగా ఇళ్లను లబ్దిదారులకు ఇస్తూ.. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటున్నారు. వరదల కారణంగా .. వచ్చిన అసంతృప్తి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీతో కవర్ చేయాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు.