ఆంధ్రప్రదేశ్ లో ఉగాదికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఈ ఏడాది మార్చి 25వ తేదీనాటికి ఇళ్ల పట్టాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది. పలు చోట్ల అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకోవటం ప్రారంభించింది. భూ సేకరణ కూడా చేపట్టింది. వైజాగ్ లో భూ సమీకరణ కూడా చేస్తోంది. చివరికి రాజధాని భూముల్ని కూడా ఇవ్వాలనుకుంటోంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక సెంటు, పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర భూమిని లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. అయితే అదే సమయంలో ప్రభుత్వం ఎన్నికలు పెట్టడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది కొత్త పథకం కావడంతో ఎన్నికల సమయంలో ఇస్తే ఓటర్లను ప్రలోభపెట్టినట్టవుతుందని ఎస్ఈసీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
అయితే సుప్రీంకోర్టు కోడ్ ఎత్తివేసింది. కానీ ఓ మెలిక పెట్టింది. కొత్త పథకాలేమీ ప్రవేశ పెట్టవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయొచ్చని.. తెలిపింది. ఇప్పుడు.. ఇళ్ల పట్టాల పథకం.. కొత్తగా.. పాతదా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఇది పాత పథకం అని మంత్రులు అంటున్నారు. ఇరవై ఐదో తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని.. స్పష్టం చేస్తున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కొత్త కార్యక్రమం అని ప్రభుత్వమే గతంలో చెప్పిందని టీడీపీ నేతలంటున్నారు. ఇంతవరకు ప్రారంభించని పథకాన్ని కొత్త పథకం కాక ఏమంటారని టీడీపీ నేతలు అంటున్నారు. మొండిగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే కోర్టు ధిక్కారం కింద సుప్రీంకోర్టుకెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.
నిజానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ఇంత వరకూ.. పూర్తి స్థాయిలో ఇళ్ల స్థలాలను సిద్ధం చేయలేకపోయింది. అనేక చోట్ల ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అసైన్డ్ ల్యాండ్స్, రాజధాని భూములు, అటవీ భూములు ఇలా ప్రతీ అంశంలోనూ.. వివాదాలు ఏర్పడ్డాయి. కోర్టుల్లో కేసులు పడ్డాయి. వీటన్నిటినీ తీసేస్తే.. నాలుగైదు లక్షల మంది లబ్దిదారులకు కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే పరిస్థితి ఉండదని అధికారవర్గాలంటున్నాయి. అయితే.. కోర్టులను సైతం లెక్క చేయని పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం… ఆ వివాదాస్పద భూముల్ని.. పంపిణీ చేయాలనుకుంటుందని అంటున్నారు.