లోఫర్ సినిమా విషయంలో అటు పూరీకి ఇటు పంపిణీదారులకూ మధ్య వివాదం ముదురుతోంది. తనపై అభిషేక్, రాందాస్, సుధీర్ అనే డిస్టిబ్యూటర్లు దాడి చేశారని, తనకు వాళ్ల నుంచి ప్రాణ హాని ఉందని పూరి.. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై పూరికి వ్యతికేకంగా పంపిణీదారులంతా ఏకమయ్యారు. పూరి తప్పుడు కేసు బనాయించారని, తమకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపించినా తాము జైలుకు వెళ్లడానికి సిద్ధమని, లేని పక్షంలో.. పూరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ మధ్య కాలంలో పూరిని తాము కలుసుకోలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని అలాంటప్పుడు దాడి ఎలా చేస్తామని పంపిణీదారులు ప్రశ్నిస్తున్నారు. పూరి నుంచి త్వరలో రెండు సినిమాలు రాబోతున్నాయని, వాటినితాము ఆటంకం కలిగించకుండా.. ముందు జాగ్రత్తగా తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని.. తమకూ సెక్షన్లు తెలుసని తాము కూడా పూరిపై కేసులు వేయగలమని హెచ్చరిస్తున్నారు డిస్టిబ్యూటర్లు.
”లోఫర్ వల్ల చాలా నష్టపోయాం. సగానికి సగం పోయింది. నష్టపరిహారంగా ఎంతోకొంత తిరిగి ఇవ్వమని నిర్మాత సి.కల్యాణ్‌ని బతిమాలుకొంటున్నాం. అంతే తప్ప… డిమాండ్ చేయడం లేదు. దీనికీ పూరికి సంబంధమే లేదు. అలాంటప్పుడు మాపై కేసులు ఎందుకు వేయాలి?? పూరి ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా? ఆ ఫుటేజీ బయటపెట్టండి. అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి” అంటున్నారు డిస్టిబ్యూటర్లు. మరి వీటికి పూరి ఏం సమాధానం చెబుతాడో మరి.