బాల్కనీ రూ.20
ఫస్ట్ క్లాస్ రూ.15
సెకండ్ క్లాస్ రూ.10
ఇవేం… పదేళ్ల క్రితం రేట్లు కావు. ఇప్పటి ధరలే. సినిమా చూడాలంటే జేబులో రూ.10 ఉంటే సరిపోతుంది. ఇలాంటి మ్యాజిక్ ఏపీలోనే సాధ్యం.
ఏపీలో, అర్జెంటుగా జీవోలు పాస్ చేయించి, టికెట్ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హై కోర్టు చెప్పినా, మార్పు రాలేదు. తగ్గించిన టికెట్ రేట్లే చలామనీ అవుతున్నాయి. తెలంగాణలో బాల్కనీ రేటు రూ.100 నుంచి రూ.150 ఉంటే, ఏపీలో అది కేవలం రూ.20 మాత్రమే. అదీ.. తాజా పరిస్థితి.
రూ.20 పెడితే సమోసా రాదు. థియేటర్లలో కూల్ డ్రింక్ తాగాలన్నా కనీసం రూ.30 ఖర్చు పెట్టాలి. అలాంటిది.. సినిమా టికెట్ మాత్రం పది కే దొరికేస్తోంది.
దానికి తోడు ప్రభుత్వాధికారులు థియేటర్లపై సోదాలకు దిగారు. టికెట్ రేట్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తూ, నిబంధనలు పాటించని దాదాపు 20 థియేటర్లకు సీజ్ చేశారు. ఈ సంఖ్య గంట గంటకీ పెరిగే అవకాశం ఉంది. ఇదంతా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే అన్నది థియేటర్ యజమానులు, బయ్యర్ల మాట. అందుకే రేపు విజయవాడలో డిస్ట్రిబ్యూటర్ల అత్యవసర సమావేశం జరగబోతోంది. థియేటర్లు నడపాలా? వద్దా? అనే విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఇప్పటి రేట్లకు థియేటర్లు నడిపే పరిస్థితి లేదు. బాల్కనీ రూ20 కి అమ్మితే కనీసం థియేటర్ల నిర్వహణ ఖర్చులు కూడా రావు. దానికి తోడు ఈ ఆకస్మిక తనిఖీలు, సీజుల గోల ఒకటి. అందుకే.. థియేటర్ యజమానులంతా ఏకం అవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. చూడాలి.. రేపు ఏం జరుగుతుందో?