రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్న రజనీకాంత్.. సినిమాల్లో కూడా ఇంకా చురుగ్గానే కెరీర్ కొనసాగిస్తున్నారు. రజనీ తాజా చిత్రం కాలా. దీనిపై చాలా అంచనాలున్నాయి. కొద్ది రోజుల క్రితం.. కావేరీ సమస్యపై రజనీకాంత్ స్పందించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని కర్ణాటకను డిమాండ్ చేశారు. రజనీ డిమాండ్ వివాదం ప్రారంభమైంది. కుమారస్వామి కూడా స్పందించారు. తమ రాష్ట్రంలో పర్యటించి.. కరువును చూసిన తర్వాత రజనీ ఆ డిమాండ్ చేయాలని సూటిగా సమాధానం ఇచ్చారు. దాంతో కథ అయిపోలేదు… కన్నడ సంఘాలు రంగంలోకి దిగాయి. రజినీ కన్నడిగుల మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు కాబట్టి… ఆయన సినిమాలను కర్ణాటకలో రిలీజ్ అవనీయబోమని ఆందోళన ప్రారంభించాయి.
ప్రస్తుతం రజనీకాంత్ కాలా విడుదలకు సిద్ధమయింది. దీంతో కన్నడ సంఘాలు… డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు హెచ్చరికలు పంపుతున్నారు. ” కాలా” సినిమాను నిలిపివేసి కర్ణాటకను వ్యతిరేకిస్తున్న వారందరికీ గుణపాఠం చెప్పాలని లేకపోతే.. దాడులకు కూడా తెగబడతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కన్నడ సంఘాల హెచ్చరికలతో కర్ణాటక ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కావేరి జల వివాదంపై ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున సినిమాను విడుదల చేయబోమని.. ప్రకటించారు. సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు చిత్ర ప్రదర్శనను ఆపివేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తమ ఆస్తులను ధ్వంసం చేస్తారని ఎగ్జిబిటర్లు కూడా కాలా ప్రదర్శనకు వెనుకడుగు వేస్తున్నారు.
ఇప్పటి వరకు రజనీకాంత్.. హీరోనే.. కానీ రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. సొంత రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడాల్సిందే. అంటే కావారీ లాంటి విషయాల్లో పొరుగు రాష్ట్రానికి విలన్ గా మారాల్సిందే. ఇప్పుడదే జరిగింది. రాజకీయాలకు సంబంధం లేకపోయినా.. ఆయన అడుగు పెట్టారు కాబట్టి.. దానికి సంబంధించిన కష్టాలు కూడా పడాల్సిందే. కర్ణాటకలో కాలా ఆగిపోతే..కోట్లలోనే నష్టం రానుంది. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుషే నిర్మించారు.