ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పదమూడు జిల్లాలను ఇరవై ఐదు జిల్లాలుగా చేస్తమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ మేరకు.. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే..నేరుగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయకుండా.. విధివిధానాలు ఖరారు చేయడానికి.. ఓ కమిటీని నియమించారు. అంటే… పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాకుండా.. ప్రజల డిమాండ్ల వారీగా.. జిల్లాల విభజన చేయడానికి ఏపీ సర్కార్ సిద్ధమయిందని అనుకోవచ్చు. ఇదే ఫార్ములాను.. తెలంగాణ సర్కార్ గతంలో అమలు చేసింది. ఫలితంగా… ఇప్పుడు తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు, పార్టీల డిమాండ్ల వారీగా ఏపీలోనూ జిల్లాల ప్రక్రియ ఉండనుంది. అంటే.. మెల్లగా.. ఒకొటొకటి పెరుగుతూ పోయి.. 30 దాటిపోయినా ఆశ్చర్యం లేదు.
జిల్లాల విభజన కత్తి మీద సాము..!
శ్రీకాకుళం జిల్లాను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజిస్తే.. అభివృద్ధిలో పాతికేళ్లు వెనక్కి పోతామని.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సందర్భం లేకపోయినా.. విజయసాయిరెడ్డి పాల్గొన్న ఓ మీటింగ్‌లో గళ మెత్తారు. ఆయన సీనియర్. ఇప్పుడు తాను నోరు తెరవకపోతే.. బతుకునిచ్చిన జిల్లాకు ఘోరమైన అన్యాయం చేసిన వాడిని అవుతాన్న ఉద్దేశంతో ఆయన నోరు విప్పి ఉండవచ్చు. కానీ.. నోరెత్తలేని వారు ప్రతీ జిల్లాలో ఉన్నారు. వైసీపీలో ఉండి.. జిల్లాల విభజనపై మథనపడుతున్నవారు ప్రతీ జిల్లాలోనూ ఉన్నారు. శుభ్రంగా ఉన్న జిల్లాలను ఎందుకు విభజించాలన్న చర్చ.. సామాన్య ప్రజల్లో ఉంది. అదే సమయంలో.. జిల్లాల విభజన పేరుతో.. ఒకే జిల్లాలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయం ఊపందుకుంటోంది. ప్రస్తుతం ఒకే జిల్లాగా ఉన్న ప్రాంతం నుంచి .. తమ ప్రాంతం విడదీయడమే కాదు.. జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే.. ఇలాంటి డిమాండ్లు చాలా ఉన్నాయి. పల్నాడు జిల్లాకు గురజాల కేంద్రం కావాలని ఒకరు.. నర్సరావు పేట కేంద్రం కావాలని మరొకరు ఉద్యమాలు ప్రారంభించారు. బాపట్ల కేంద్రం కావాలని మరో ఉద్యమం జరుగుతోంది. వెనుకబడిన ప్రాంతాల్లో జిల్లా కేంద్రం పెట్టాలని వేమూరు లాంటి చోట్ల కూడా వాయిస్‌లు వినిపిస్తున్నాయి. ఇది ఒక్క గుంటూరు జిల్లా నుంచి మాత్రమే.. దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ.. ఇలాంటి వాదనలతో.. రెండు, మూడు గ్రూపులు ప్రారంభమయ్యాయి.
రాజకీయాలు డామినేట్ చేస్తే.. ప్రజల మధ్య చిచ్చే..!
తెలంగాణలో జిల్లాల విభజన నాటి పరిస్థితులు వేరు. అప్పట్లో.. జిల్లాల విభజన జరిగి తీరాల్సిందేనని.. జరగడం వల్ల అభివృద్ధి.. ఉద్యోగాలు వస్తాయన్న ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం చేసింది. దానికి తగ్గట్లుగా ప్లాన్డ్గా… ఉద్యమాలు నడిపించేలా చేసింది. ఆ ఉద్యమాల్ని పీక్స్‌కి తీసుకెళ్లి ప్రజల కోరిక తీరుస్తున్నామన్నట్లుగా ప్రకటనలు చేశారు. జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే.. పేరుకే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కానీ… అవి ఉనికిలో ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ.. ఉమ్మడి జిల్లా అనే పేరుతోనే అధికార యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రతీ జిల్లాకు ప్రత్యేకంగా కలెక్టర్‌ను.. ఎస్పీని నియమించారు కానీ.. సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేక.. ప్రభుత్వం అవస్థలు పడుతోంది. జిల్లాల ఏర్పాటు వల్ల.. కొన్ని వందల కోట్లు ఖర్చుతో పాటు.. యంత్రాంగం అంతా కుదుపునకు గురవుతుంది. దీని వల్ల కొన్నాళ్ల పాటు పాలన స్తంభించిపోతుంది. అదే సమయంలో .. తమ ప్రాంతానికి జిల్లా కావాలని.. జిల్లా కేంద్రం కావాలని.. రాజకీయాలు ఊపిరి పోసుకుంటే మాత్రం.. ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లుగానే అవుతుంది. ఇప్పటికే ఒకే జిల్లాగా ఉన్న ప్రజల మనసుల్లో విభజన బీజాలు నాటినట్లు అవుతుంది. రాజకీయం అంటే.. విభజించి పాలించడమే కాదు.. రాజకీయ పార్టీలు.. ఇలాంటి అవకాశం వస్తే వదిలి పెట్టవు. ఎంతగా సెగ రాజేయాలో.. అంతగా రాజేసి..చలి కాచుకుంటాయి.
పార్లమెంటరీ నియోజకవర్గాలే జిల్లాలంటే అర్థం పర్థం ఉండనట్లే..!
గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. ఒంగోలు దాటి.. బాపట్లకు పోవాల్సి ఉంటుంది. అంటే.. ఒంగోలు జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న దాన్ని ఎక్కడో మరుమూల ప్రాంతంలో కలిపినట్లవుతుంది. అందుకే సంతనూతల పాడుప్రజల్లో ఆందోళన నెలకొంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం.. తిరుపతిని ఆనుకుని ఉంటుంది. కానీ.. ఆ నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలపాల్సిన పరిస్థితి. ఇక గిరిజన నియోజకవర్గం అరకు పరిస్థితి గురించి చెప్పాల్సిన పని లేదు. మూడు జిల్లాల్లో నియోజకవర్గం ఉంది. ఇలా ప్రతీ జిల్లాలోనూ.. అసంబద్ధం.. అర్థం..పర్థం లేకుండా.. విభజన చేయాల్సిన పరిస్థితి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు… కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవచ్చన్న ఆలోచన .. చేయలేదు. అలా చేసి ఉంటే.. మరింత పకడ్బందీగా.. నియోజకవర్గాలను విభజించి ఉండేవారేమో..? కానీ ఇప్పుడు.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా… జిల్లాలను ఏర్పాటు చేస్తామనే మొండి పట్టుదలకుపోవడం.. ఇబ్బందికరం అవుతోంది. ప్రజలకు ఏది ఉపయోగం ఉంటే అదే చేస్తామని.. ఏది దగ్గరగా ఉంటే.. అదే జిల్లా కేంద్రం చేస్తామని. ప్రభుత్వం చెప్పవచ్చు. కొత్త జిల్లాలకు మధ్యలోనే రాజధానిని ఏర్పాటు చేస్తామని కొంత మంది అధికారులు.. మంత్రులు చెబుతున్నారు. అలాంటి సమయంలో.. మధ్యలోనే ఉన్న రాజధానిని మాత్రం ఎందుకు తరలిస్తున్నారన్న ప్రశ్నలు వస్తాయి.
ఇప్పుడు జిల్లాల విభజన అంత అవసరం ఏమిటి..?
ప్రస్తుతం జిల్లాల విభజన అనేది… ప్రజలకు అవసరం లేని విషయం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ముప్పు ముంగిట ఉంది. ప్రమాదకరమైన వైరస్.. అంతకంతకూ విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో యంత్రాంగం మొత్తం.. కరోనాపై పోరాటంపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఏ ఒక్కరి వ్యాపారాలు .., ఉద్యోగాలు సక్రమంగా లేవు. ఒక్కరంటే.. ఒక్కరికీ.. పూర్తి స్థాయి ఆదాయం లేదు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత అరకొరగా సాగుతున్న పనులు.. నడుస్తున్న వ్యాపారాలు.. ప్రజల స్థితిగతుల్ని మెరుగుపర్చడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సింది.. ప్రజలకు భరోసా కల్పించడం. కరోనా వల్ల.. జీవితాల్లో వచ్చేకష్టాలు తాత్కాలికమేనని.. అందరికీ మంచి జరుగుతుందనే భరోసాను కల్పించాలి. ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేస్తామని.. చేతల్లో చూపించాలి. అంతే కాదు…ప్రజలకు హామీ ఇచ్చానంటూ.. అసలు విషయాలను పక్కన పెట్టి.. రాజకీయ ప్రయోజనాల కోసం… జిల్లాలను ముక్కలు చేసుకుంటే.. మిగిలేది అంధకారమే.
ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటే బలయ్యేది అధికార పార్టీనే..!
ఓ వైపు అష్టకష్టాల్లో ప్రజలు ఉన్నారు. మరో వైపు ప్రభుత్వం జిల్లాల విభజన రాజకీయం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో… ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటే.. అధికార పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోతుంది. తమ ప్రాంతాలు.. జిల్లాలతో ప్రజలు సెంటిమెంటల్‌గా ముడిపడిపోయారు. జిల్లాల విభజన తర్వాత వారికి కొత్త సమస్యలు వచ్చి పడితే.. వాటిని పరిష్కరించలేకపోతే… ఆ ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా ఉంటుంది. తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందని… పలు కారణాల ద్వారా ఒక ప్రాంతం వారు.. మరో ప్రాంతం వారు అనుకుంటే..అది మొదటికే మోసం వస్తుంది. సొంత పార్టీ నేతలు ఇప్పటికే ఈ విషయంలో.. తమను రాజకీయంగా అణగదొక్కడానికే.. కొత్త జిల్లా నివాదం తీసుకొచ్చారని అనుమానిస్తున్నారు. ఇవన్నీ… ప్రభుత్వానికి పెనుసవాళ్లే.
ప్రస్తుత ప్రభుత్వ వాదన ప్రకారం.. జిల్లాల విభజన అనేది ఉపయోగం లేని వాదన. ఎందుకంటే.. పరిపాలనా సౌలభ్యం అనేదానికి.. ఈ ప్రభుత్వం.. అమరావతిని తరలించేటప్పుడు కొత్త వాదన వినిపించింది. రాజధానికి సామాన్య ప్రజలతో సంబంధం లేదని… వార్డు, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచే పాలన జరుగుతోందని.. ఇక ప్రజలకు రాజధానితో.. జిల్లా కేంద్రాలతో పని లేదని చెబుతోంది. ఆ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఇక జిల్లాల విభజన అవసరం లేదు. ప్రజలెవరికీ జిల్లాలతో పని లేదు. కానీ అవసరం ఉంది మాత్రం రాజకీయానికే. ప్రజలతో సెంటిమెంటల్ పొలిటికల్ గేమ్స్ ఆడటానికే…! ఆ విషయం ప్రజలకు అర్థమైన రోజున.. ఫలితాలు వేరుగా ఉంటాయి.