తెగేవరకు లాగడం అంటే ఏమిటో బహుశా ఇప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి స్వానుభవంలోకి వస్తుండాలి. ‘నాజాతి కోసమే నేనిదంతా చేస్తున్నా.. నా జాతి బాగుంటే చాలు..’ అని పలుకుతూ ఉంటే.. తనకు జాతి నాయకుడిగా నిర్ద్వంద్వంగా గుర్తింపు వచ్చేస్తుందని ఆయన బహుశా అనుకుని ఉండవచ్చు. కానీ.. ఆయన దీక్షానిబద్ధతలో కాస్త వక్రమార్గాలు కనిపిస్తూ ఉండడం… రాజకీయ కోణాలు పెరుగుతూ ఉండడం, ఆయన కాపు నిబద్ధత గాడితప్పినట్లు సంకేతాలు ఇస్తూ ఉండడం.. అన్నిటినీ మించి ప్రభుత్వానికి అవసరమైన వ్యవధి ఇవ్వకుండానే, వారు చేస్తున్న మంచిని గమనించకుండానే.. మళ్లీ దీక్షలు అంటూ ఉద్యమిస్తుండడం ఇవన్నీ.. కాపుజాతిలో ఆయన ప్రభను పలుచన చేసేస్తున్నట్లున్నాయి.
వివరాల్లోకి వెళితే..
కాపు ఉద్యమ నాయకుడిగా తన స్థాయిని ముద్రగడ స్వయంగా తగ్గించేసుకున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఇస్తానని ఆఫర్లు పెట్టారంటూ చవకబారు ప్రకటనలు చేయడం ద్వారా ముద్రగడ స్థాయి పడిపోయింది. గురువారం సాయంత్రంలోగా తాను చెప్పిన అన్ని డిమాండ్లను ఒప్పుకోకపోతే.. శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ముద్రగడ అంటున్నారు. అయితే.. ఆయన దీక్షకు ఇదివరకటి మాదిరిగా జనం మద్దతు యూనివర్సల్‌గా లభించే అవకాశం కనిపించడం లేదు.
ముద్రగడ మళ్లీ దీక్షకు కూర్చోవడంలో ఔచిత్యం లోపించిందని.. కాపుసోదరులే భావిస్తున్నారు. మద్దతు ఇవ్వరాదంటూ (ప్రత్యేకించి తెదేపా ముద్ర లేకపోయినప్పటికీ) కాపుల్లోని ఒక వర్గం విడిగా బెజవాడలో ఓ సమావేశం నిర్వహించి నిర్ణయించడం ఇక్కడ గమనార్హం. కిందిస్థాయి కాపుల్లో గమనించినప్పటికీ.. కాపుల సంక్షేమం దిశగా చంద్రబాబు సర్కారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నది.. చిత్తశుద్ధితోనే ఉన్నది అనే నమ్మకం ఎంతో కొంత ప్రతివారిలోనూ ఏర్పడింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ముద్రగడ మళ్లీ దీక్ష అంటోంటే దానికి విలువ లేకుండా పోతున్నదని పలువురు అనుకుంటున్నారు.