ఎన్నో అంచనాల మధ్య భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదలైంది. యూ ట్యూబ్‌లో.. భీమ్లా ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే రికార్డులు సృష్టిస్తోంది. అయితే.. ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా లేదన్నది ఫ్యాన్స్ మాట. ఎక్కడో, ఏదో తగ్గిందని… చాలామంది ఫీలింగ్. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 140 సెకన్ల ట్రైలర్ ఇది. పవన్ , రానా పాత్రల మధ్య వైరాన్ని బాగానే చూపించినప్పటికీ.. ఆశించినంత ఫైర్ ఈ ట్రైలర్లో కనిపించలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగు ఒక్కటీ కనిపించలేదు. `నేను అవతల ఉంటేనే చట్టం… ఇతలికొస్తే కష్టం` అనేది ప్రాస కోసం వాడినట్టు ఉంది తప్ప.. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లేదు. అన్నింటకంటే ప్రధానంగా తమన్ బీజియమ్ అంతగా రిజిస్టర్ కాలేదు. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ట్రైలర్ తో వాటిని పెంచడం ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టే.. ఇలా సాదా సీదాగా కట్ చేసుంటారన్నది ఫ్యాన్స్ మాట. అది నిజమే అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే.. ఈ యేడాది వస్తున్న పెద్ద సినిమా ఇది. సినిమా బాగుంటే, కలక్షన్లు దంచి కొడితే రాబోయే సినిమాలకు కాస్త ఉత్సాహం వస్తుంది. ట్రైలర్ ఎలా ఉన్నా… దాని గురించి ఎవరేమనుకుంటున్నా, ఓపెనింగ్స్ దుమ్ము దులిపేయడం ఖాయం. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో భీమ్లా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.