తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు… ఈ మధ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారన్నది తెలిసిందే. పాత కక్షలూ రాజకీయాలూ పక్కన పెట్టేసి కొత్త దోస్తానా షురూ చేసుకున్నారు. ఒకప్పుడు ఉప్పూ నిప్పూలా ఉండేవారు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు వచ్చేవారు కాదు! ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒక చోట కనిపించేవారే కాదు. కేసీఆర్ వస్తే చంద్రబాబు గైర్హాజరు, చంద్రబాబు ఉంటే కేసీఆర్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఉండేది. చివరికి, ఈ ఇద్దర్నీ ఒక చోట కలిపి కూర్చోబెట్టేందుకు గవర్నర్ నరసింహన్ కూడా చాలా ప్రయత్నాలే చేశారు. ఏదైతేనేం… ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాజాగా ఇద్దరు చంద్రులూ గవర్నర్ను కలుసుకున్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో మాట్లాడుకున్నారు! అయితే, ఈ మాటల్లో హైకోర్టు విభజన ప్రస్థావనకు వచ్చినట్టు సమాచారం.
వీలైనంత త్వరగా హైకోర్టు విభజన ప్రక్రియ జరగాలని చంద్రబాబు ముందు కేసీఆర్ ప్రస్థావించారట! ఈ విషయంలో ఏపీ సహకరించాలని అన్నారు. అయితే, దీనిపై స్పందించేందుకు కాస్త ఇబ్బందిపడ్డట్టు తెలుస్తోంది. ఒక్కోటీ ఒక్కోసారి ఎందుకూ.. విభజన ప్రకారం జరగాల్సిన పంపకాలన్నీ ఒకేసారి చేసేసుకుందాం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొన్నటికి మొన్న సెక్రటేరియట్ అన్నారు… ఇప్పుడు హైకోర్టు అంటున్నారేంటి..? ఇంకా కొన్ని సంస్థల మధ్య జరగాల్సిన పంపకాలు కూడా ఉన్నాయి కదా అని చంద్రబాబు అన్నారు. నిజానికి, ఇదే మాట గతంలో కూడా చెబుతూ వచ్చారు. బాబు స్పందనపై కేసీఆర్ కూడా కాస్త ముఖం చిట్లించినట్టు తెలుస్తోంది!
ఇదే టాపిక్ మీద ఇద్దరి చంద్రుల మధ్యా చాలా సేపు చర్చ జరినట్టు సమాచారం. అయితే, ఎప్పటికీ ఒక కొలీక్కి రాకపోతూ ఉండటంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకున్నారనీ, అన్ని సమస్యల్నీ త్వరలోనే పరిష్కరించుకుందామనీ, ఎవ్వరూ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని అనునయించి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు సమాచారం. సో.. కేసీఆర్ మరోసారి హైకోర్టు విభజన అంశాన్ని బలంగానే వినిపించే అవకాశం ఉంది. అదే జరిగితే, ఇతర సంస్థల ఆస్తుల పంపకాల ఇష్యూని తెరమీదికి తెచ్చేందుకు చంద్రబాబూ సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు అంటున్నాయి! మరి, ఇద్దరు చంద్రులూ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి! మళ్లీ పంతాలకు పోతారేమో..!