హైదరాబాద్: భూమికి ఒక అంచున ఉండే మనుషులను మరో అంచులో ఉండేవారితో కలుపుతున్న టెక్నాలజీ ఇప్పుడు మనుషులు విడిపోవటానికికూడా సాయపడుతుండటం విశేషం. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భార్యాభర్తల జంట ఒక ఆన్లైన్ కమ్యూనికేషన్ టూల్ – ‘స్కైప్’ సాయంతో విడాకులు తీసుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం నగరానికి చెందిన నల్లపనేని కిరణ్‌కుమార్‌కు అదే నగరానికి చెందిన కేతినేని పావనికి 2012 సంవత్సరంలో వివాహమయింది. పావని కాపురానికి రాకముందే అభిప్రాయ బేధాలు మొదలయ్యాయి. వివాహాన్ని రద్దు చేయాలని కిరణ్ కుమార్ 2012 జూన్ 8న ఖమ్మం సివిల్ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తనను అధిక కట్నంకోసం వేధించారంటూ కిరణ్, అతని తల్లిదండ్రులపై పావని 2013లో హైదరాబాద్ 13వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు పెట్టారు. ఇరుపక్షాలమధ్య మూడేళ్ళుగా విచారణ సాగింది. ఖమ్మంలోని ప్రముఖుల సాయంతో న్యాయవాదుల చొరవతో ఇరుపక్షాలూ రాజీకి వచ్చాయి. ఈలోగా పావని అమెరికా వెళ్ళి ఎంఎస్ పూర్తి చేసింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమె ఖమ్మం కోర్టుకు వచ్చి విడాకులకు తన అంగీకారం తెలపటానికి సమయం దొరకటంలేదు. దానితో ఆమె తన తండ్రికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది. అయినా విడాకుల కేసులో ప్రతివాది నేరుగా హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు.
ఇక్కడే కేసు ఒక మలుపు తిరిగింది. మద్రాస్ హైకోర్ట్ జడ్జి నూతి రామ్మోహనరావు ఇటీవలే స్కైప్ ద్వారా ఒక కేసులో విచారణ జరిపి పరిష్కారం చేశారు… తీర్పు ఇచ్చారు. దేశంలోనే అలా స్కైప్ ద్వారా కేసును విచారించటం అదే మొదటిసారి. ఇదే పద్ధతిలో తన కేసునూ విచారించాలని పావని తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఆమోదించిన ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జ్ మర్రిపాటి వెంకటరమణ మొన్న శనివారం విడాకులకు పావని అంగీకారాన్ని స్కైప్ ద్వారా నమోదు చేసి విడాకులను మంజూరు చేశారు.