బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకొన్న దివ్యవాణి.. కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆమె ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి తాను నిస్వార్థంగా సేవ చేస్తున్నా, గుర్తించడమే లేదని, తాను అధికారం లేని, అధికార ప్రతినిధి అని, ఓ కళాకారుడు పెట్టిన పార్టీలో, కళాకారులకు స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు.
దివ్యవాణి కోపానికి ఓ కారణం ఉంది. ఇటీవల జరిగిన `మహానాడు`లో దివ్యవాణికి మైక్ ఇవ్వలేదు. ఆమెకు మాట్లాడే అవకాశం రాకపోవడంతో దివ్యవాణి అలిగారు. అందుకే తన కోపాన్ని ఈ విధంగా బహిర్గతం చేశారు. “మమానాడు కోసం అర్థరాత్రి కారులో ఒంటరిగా ప్రయాణం చేశాను. ఆ సమయంలో నాకు ఆరోగ్యం కూడా సరిగాలేదు. అయినా సరే రిస్క్ చేశాను. దార్లో నాకేమైనా అయితే ఏమయ్యేదో? నా శవాన్ని అడ్డం పెట్టుకుని.. ఓట్లు అడుతారేమో? అంతకు మించి ఏం చేయలేరు. మహానాడులో నాకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. నాకు మాట్లాడడం చేతకాదా? మాటలు రావా?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. అవకాశం వస్తే వైకాపాలోకి వెళ్తానంటూ సంకేతాలు కూడా పంపారామె. “నేను దేవుడి బిడ్డని.. వైకాపాలో నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. అక్కడైనా నాకు ఆదరణ దక్కుతుందేమో? `నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది` అని కొంతమంది నాకు అభయహస్తం అందించారు. చూద్దాం.. ఏం జరుగుతుందో“ అన్నారు దివ్యవాణి. చూస్తుంటే ఆమె టీడీపీ నుంచి వైకాపాలోకి జంప్ అయ్యే ఛాన్సులే ఎక్కువ కనిపిస్తున్నాయి. వైకాపాలో ఫైర్ బ్రాండ్లకు లోటు లేదు. అక్కడ ఆల్రెడీ రోజా ఉన్నారు. మరి.. దివ్యవాణి అవసరం వైకాపాకు ఉంటుందా?