తెలుగుదేశం పార్టీలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదని.. అవమానాలకు గురి చేశారని ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన దివ్యవాణి వైసీపీలో చేరుతారని అనుకున్నారు. వైసీపీ నేతల నుంచి వచ్చిన సందేశాల మేరకు ప్రెస్మీట్లలో మాట్లాడినా చివరికి ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. పార్టీలో చేరమని పిలువలేదు. దీంతో చూసి చూసి దివ్యవాణి బీజేపీ తలుపు తట్టారు. ఏపీ బీజేపీలో చేరడం కన్నా ఖాళీగా ఉండటం బెటరనుకున్నారేమో కానీ తెలంగాణ బీజేపీ వైపు మళ్లారు.
బీజేపీ చేరికల కమిటీ ఇంచార్జ్ ఈటల రాజేందర్‌తో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఈటల రాజేందర్ హైకమాండ్‌తో మాట్లాడి చెబుతానని పంపించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత దివ్యవాణి బీజేపీ నేతలను తను సంప్రదించారని.. అందుకే ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యానన్నారు. బీజేపీ లో చేరే అంశాన్ని తొందరలోనే ప్రకటిస్తానన్నారు. తెలంగాణ తో పాటు నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధమని..ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు.
నాకు తమిళ నాడు, కర్ణాటక తోనూ అనుబంధం ఉంది బీజేపీ ని మరింత బలోపేతం చేయడానికి నావంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే దివ్యవాణి టీడీపీ నుంచి బయటకు వచ్చిన విధానం.. తర్వాత ఆ పార్టీ నేతలపై చేసిన విమర్శలు… ఇతర అంశాలు ఆమెను బీజేపీలో చేర్చుకునేందుకు అడ్డుపడే అవకాశాలున్నాయి. పైగా ఆమె ఇప్పటి వరకూ ఏపీ రాజకీయాల్లో ఉండి ఇక నుంచి తెలంగాణ రాజకీయాలంటే యాక్సెప్ట్ చేయడం కష్టమని అంటున్నారు.