సినీనటి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఒక ఛానల్ లో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ లేనివిధంగా 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నిర్వహణ మీద, ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ఆరోపణలు రావడం, సోషల్ మీడియాలో అయితే ఈవీఎం మిషన్ల ట్యాంపరింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో దివ్యవాణి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తాను చంద్రబాబును కలిశానని, చంద్రబాబు ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అని, ఆ పరిణితితోనే ఎన్నికల ఫలితాలపై స్పందించాడని దివ్యవాణి వ్యాఖ్యానించింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎం మిషన్ల పై, ఎలక్షన్ కమిషన్ పై, ఎన్నికల నిర్వహణపై పోరాటం చేయడం గురించి స్పందించిన దివ్యవాణి, ఒక క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటే మన దేశంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారని, అలాంటిది ఎన్నికలు నిర్వహించాలంటే అంతకు మించిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో సైతం, అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ డౌన్ డౌన్ అంటూ ప్రజలు సైతం నినాదాలు చేయడం, ఈవీఎంలు మొరాయించడం కూడా కేవలం ఒక పార్టీకి బలం లేని చోట్ల మాత్రమే మొరాయించాయి అన్న సందేహాలు రావడం- ఇవన్నీ ఈ ఎన్నికల సందర్భంగా నెలకొన్న సిత్రాలు. అది కాక కొన్నిచోట్ల ఊహించని ఫలితాలు రావడం, చాలాచోట్ల పోలైన ఓట్ల కు, చివరలో కౌంట్ చేసిన ఓట్లకు సరిపోలకపోవడం కారణంగా ఎలక్షన్ కమిషన్ మీద , 2019 ఎన్నికల నిర్వహణ మీద కొంత మంది ప్రజలలో అనుమానాలు ఉన్న మాట వాస్తవమే.
మరి భవిష్యత్తులోనైనా ప్రజల్లోని అనుమానాలు నివృత్తి చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ వైఖరి ఉంటుందా లేక మరిన్ని అనుమానాలు సృష్టించేలా వారి వైఖరి ఉంటుందా అన్నది వేచి చూడాలి.