తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రవర్తన ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. సొంత పార్టీ మీదే విమర్శలు చేస్తూ అధినాయకత్వానికి తలనొప్పులు కలిగించడం ఆయనకు అలవాటే. అయితే, ఇటీవలే విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయన చేసిన వీరంగాన్ని అందరూ చూశారు. నిర్ణీత సమయంలో వచ్చినా కూడా తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వలేదంటూ నానాయాగీ చేశారు. అయితే, అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న మంత్రి జోక్యంతో.. జేసీకి బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఈ విషయాన్ని తరువాత ఆయనే స్వయంగా చెప్పారు కూడా! ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామనీ, వివరాలు తెప్పించుకున్నామనీ, భద్రతకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించేవారు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. కానీ, ఆ తరువాత జేసీ ప్రవర్తనకు సంబంధించి ఎక్కడా ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయాన్ని మరిపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా.. విమానయాన సంస్థలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం!
తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఆదివారం ఉదయాన్నే ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ట్రూ జెట్ విమానంలో ఆయన ప్రయాణించేందుకు టిక్కెట్ కూడా తీసుకున్నారు. అయితే, బోర్డింగ్ పాస్ దగ్గరకి వచ్చేసరికి.. సదరు విమానయాన సంస్థ జేసీకి ఝలక్ ఇచ్చింది! బోర్డింగ్ పాస్ ఇవ్వడం కుదరదు అని ఎయిర్ పోర్టు సిబ్బంది తెగేసి చెప్పేశారు. ‘మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించడం సాధ్యం కాద’న్నారు. రొటీన్ గా అయితే జేసీ ఇక్కడ కూడా విశాఖ విమానాశ్రయం సీన్ రిపీట్ చేస్తారనుకుంటాం! కానీ, అక్కడ చేసేదేం లేక జేసీ వెనక్కి వచ్చేశారు.
విశాఖ ఘటన తరువాత మంత్రి అశోక్ గజపతి సిఫార్సుతో అక్కడ విమానం ఎక్కేశారు. కానీ, ఆ తరువాత ఎయిర్ పోర్టు నుంచి జేసీ వెనుదిరగడం ఇదే మొదటి సారి. విశాఖ వీరంగం తరువాత ఇండిగో విమానాల్లో జేసీకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందా సంస్థ. తమ సిబ్బందితో దురుసు ప్రవర్తన కారణంగా చూపిస్తూ ఆ విమానయాన సంస్థ జేసీపై నిషేధం విధించింది. ఇండిగోకి మద్దతుగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ కూడా నిషేధాన్ని ప్రకటించాయి. ఇప్పుడు స్పైస్ జెట్ కూడా జేసీకి నో ఎంట్రీ అనేశాయి. ఇకపై ఆయన విమానాశ్రయాలకు వెళ్లకపోవడమే ఉత్తమం! వెళ్తే ఇలాంటి అవమానాలు గ్యారంటీ! అయితే, ఇప్పటికైనా తీరు మార్చుకుని.. విశాఖలో దురుసు ప్రవర్తనపై స్పందించి క్షమాపణలు కోరితే తప్పేముంది..? తన ప్రవర్తనకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నా కూడా ఇంకా పంతమెందుకు..? ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అర్థమైపోతూనే ఉంది.