ఏపీలో వైసీపీపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారిలో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు ముందు ఉంటారు. సున్నితమైన ప్రాంతంలో దేనికీ తల వంచకుండా పోరాడుతున్నారు. వచ్చే ఎన్నికలకు తమకు జీవన్మరణ సమస్య అని నేరుగానే చెప్పి పోరాడుతున్నారు. పోలీసులు, వ్యవస్థ ఇలా మొత్తాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన పోరాటంపై ఎవరికీ డౌట్ లేదు కానీ.. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. తమ్ముడికి గ్రౌండ్ వదిలేసి వెళ్లిపోయారా అన్న చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ వారసులను రాజకీయాలకు దింపారు. తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు, అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరూ ఓడిపోయారు. ఓడిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి మరింత యాక్టివ్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు.క్యాడర్ ను కాపాడుకోవాలంటే తప్పదు. తాడిపత్రి అలాంటిది. కానీ జేసీ దివాకర్ మాత్రం సైలెంట్ అయ్యారు. వయసు మీద పడటంతో సైలెంట్ గా ఉన్నా.. ఆయన కుమారుడు కూడా టీడీపీలో యాక్టివ్ గా లేకపోవడంతో ఏం జరుగుతుందోనని టీడీపీ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.
లోకేష్ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలతో పాటు పార్టీలో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సైతం పాదయాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. జెసి దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి లు ఈ యాత్రలో పాల్గొన్నారు. కానీ జేసీ పవన్ రెడ్డి పాల్గొనలేదు. జేసీ పవన్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరని.. ఏదైనా అసెంబ్లీ సీటు కోరుతున్నారని అంటున్నారు. అసెంబ్లీ సీట్లు ఖాళీ లేవని టీడీపీ పెద్దలు చెబుతున్నారు.