దసరా సీజన్లో తెలుగులో సినిమాలొచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మరి ఈ దీపావళికి ఏం జరుగుతుందో…? ఈ సీజన్ అయినా క్యాష్ చేసుకొంటుందా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ దీపావళి టాలీవుడ్ కి కొత్త మెరుపులు తీసుకొచ్చింది. చాలా కాలం తరవాత థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఈ పండక్కి వచ్చిన లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలకు మంచి వసూళ్లు దక్కాయి. ముఖ్యంగా నైజాంలో వసూళ్లు బాగున్నాయి. ఓ ఏరియాలో ‘క’ కి మంచి వసూళ్లు వస్తే, మరో చోట ‘అమరన్’ ఆధిపత్యం చూపించింది. ఇంకో చోట ‘లక్కీ భాస్కర్’ది పై చేయి అయ్యింది. ఈ శని, ఆదివారాలు మరిన్ని వసూళ్లు అందుకొనే అవకాశాలు ఉన్నాయి.
తొలుత ‘క’కు సరైన థియేటర్లు దొరకలేదు. అయితే ఇప్పుడు మెల్లమెల్లగా `క` కొత్త థియేటర్లను చేర్చుకొంటోంది. ‘అమరన్’ ఇప్పటికే తెలుగులో బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడిందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. శివకార్తికేయన్ చిత్రాల్లో తెలుగులో ఇంత మంచి ఓపెనింగ్స్ దేనికీ రాలేదు. కిరణ్ అబ్బవరం అయితే ఇన్ని వసూళ్లు తన కెరీర్లోనే చూడలేదు. అన్నిటికంటే ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ మూడు చిత్రాలూ కుటుంబ సమేతంగా చూసేలానే ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అసభ్యతకూ తావులేదు. ‘క’, ‘అమరన్’లతో పోలిస్తే.. ‘లక్కీ భాస్కర్’కు ఎక్కువ థియేటర్లు దక్కాయి. లాంగ్ రన్లో ‘లక్కీ భాస్కర్’ అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. పైగా ‘లక్కీ భాస్కర్’కు తమిళ, మలయాళంలోనూ మంచి వసూళ్లు దక్కుతున్నాయి. మలయాళంలో రూ.25 కోట్ల వరకూ సాధించే అవకాశం ఉందని నాగవంశీ చెబుతున్నారు.