కరోనాతో అతలాకుతమైన వ్యాపారాల్లో మీడియా కూడా ఒకటి. అన్ని భాషల మీడియాలు నలిగిపోయాయి. ముఖ్యంగా తెలుగు మీడియాకు అయితే ఊపిరి ఆగినంత పనయింది. ఉద్యోగుల తీసివేతలు..జీతాల కోతలు… జరిగాయి. తగ్గించిన జీతాలు ఇప్పటికీ పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. అయితే క్యాష్ రిచ్ మేనేజ్మెంట్లు మాత్రం తమ సంస్థలపై ఇలాంటి ఒత్తిడిని తామే భరిస్తున్నారు. అయితే అందరూ కాదు. కొంత మందే. టీవీ9 యాజమాన్యం ఈ విషయంలో ముందంజలో ఉంది. సరిగ్గా జీతాలిస్తే చాలని ఇతర మీడియా సంస్థల సిబ్బంది అనుకుంటూంటే… టీవీ9 యాజమాన్యం అనూహ్యంగా దీపావళి గిఫ్ట్ ఇచ్చేసింది.
ఉద్యోగులందరికీ.. నిర్ణయించిన పద్దతి ప్రకారం జీతం ఇంక్రిమెంట్ లు పెంచారు. ఈ మేరకు గ్రూప్ సీఈవో బరున్ దాస్ నుంచి ఉద్యోగులకు మెసెజ్ వచ్చింది. కరోనా కాలంలో ఉద్యోగులందరూ.. మనో ధైర్యంతో పని చేశారని.. బరున్ ప్రశంసించారు. ఆర్థికంగా కష్టమైనా.. ఉద్యోగుల్ని నిరాశపర్చకూడదని ఇస్తున్నట్లుగా సీఈవో చెబుతున్నారు. అదే సమయంలో ప్రతీ ఏడాది మార్చిలో ఇంక్రిమెంట్లు వేస్తారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది వేయలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇస్తున్నారు. అంటే… బకాయిలు కూడా ఇస్తారన్నమాట.
ఒక్క ఉద్యోగికి వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటే.. తొమ్మిది నెలలకు తొమ్మిది వేలు ఎరియర్స్ ఇస్తారు. మళ్లీ వచ్చే మార్చిలో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్ విషయలోనూ ఆలస్యం కాబోదని… సీఈవో టీవీ9 ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మొత్తానికి టీవీ9 ఉద్యోగులకు నిజంగానే దీపావళి పండుగ వచ్చినట్లయింది.