తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అనేవి కొత్త కాదు..! సీనియర్ల మధ్య సమన్వయ లోపం అనేది ఎప్పట్నుంచో ఉన్నదే. కొంతమంది సీనియర్లు ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గ్రూపు అన్నట్టుగా కనిపిస్తుంటారు. తాజాగా నిత్యం వార్తల్లో ఉంటోంది మాజీ మంత్రి డీకే అరుణ వర్గం! ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై ఆమె వర్గం తీవ్రంగానే వ్యతిరేకిస్తోంది. మరీ ముఖ్యంగా నాగం జనార్థన్ రెడ్డి చేరిక విషయంలో ఆ వర్గం ఎంత అసహనం వ్యక్తం చేసిందో చూశాం. అయితే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాలు చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ కూడా రెడీ అంటోంది కదా.ఈ అంశంపై డీకే అరుణ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే కొత్త కాదనీ, ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటామని ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
సీనియర్ల మధ్య కొంత సమన్వయ లోపం ఉంది కదా, ఎన్నికలకు సిద్ధమంటున్న సమయంలో దీన్ని ఎలా సరిదిద్దుకుంటారనే ప్రశ్నకు అరుణ చెప్పిన సమాధానం కొత్తగా వినిపిస్తోంది..! కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఏ పార్టీలోనైనా కొంత సమన్వయ లోపం ఉండటం సహజమని అరుణ అన్నారు. అన్ని పార్టీల్లోనూ గ్రూపులు ఉంటాయనీ, వాటిని మెంటెయిన్ చేసే నాయకులు ఉంటారని చెప్పారు. తెరాసలో గ్రూపులు లేవా, ఒకపక్క కొడుకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటే, మరోపక్క అల్లుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనీ, ఇంకోపక్క బిడ్డ కూడా సీఎం అవుతానని కోరుకుంటోందన్నారు! కేసీఆర్ కుటుంబంలోనే గ్రూపులున్నాయని ఎద్దేవా చేశారు. అయితే, ఇలాంటి పోటీ అనేది ఆరోగ్యకరమైనదనీ, పోటీ తత్వం ఉండటం వల్లనే పెద్ద ఎత్తున ప్రజలకు సేవలు అందుతాయన్నారు!
సో.. గ్రూపు రాజకీయాల వల్ల ఇంత మేలు జరుగుతుందని అరుణ చెప్పడం విడ్డూరంగా ఉంది! గ్రూపు రాజకీయాల వల్ల ప్రజలకు మెరుగైన సేవలందుతాయనడం మరీ మరీ విచిత్రం..! కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఉంది కాబట్టి.. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇలాంటి వాదన వినిపిస్తే ఎలా..? గ్రూపు రాజకీయాలు ఏరకంగా ప్రజలకు సేవలందించే క్రమాన్ని మెరుగుపరుస్తాయి. గ్రూపులున్నంతా మాత్రాన పోటీ పడి ప్రజలకు సేవలు చేసేస్తారా..? అలా అయితే, టి. కాంగ్రెస్ లో గ్రూపులు చేస్తున్న సేవలేవీ..? పార్టీ నేతలంగా ఐక్యంగా ఉంటేనే కదా ప్రజల గురించి ఆలోచించగలరు. ఆధిపత్య పోరు ఉంటే సమయమంతా దానికే సరిపోతుంది. నాగం రాకను అడ్డుకునేందుకు డీకే అరుణ వర్గం ఎంత ప్రయాసపడింది, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదులు చేసొచ్చారు. దీన్లో ప్రజా ప్రయోజన కోణం ఎక్కడుంది..? దీని వల్ల పోటీ పడి మరీ ప్రజలకు సేవలు చేసేసిన ఆ నాయకులు ఎవరు..?