ఏ ముహూర్తాన టీడీపీ నుంచి నాగం జనార్థన్ రెడ్డి బయటకి వెళ్లారో.. అక్కడి నుంచీ చేరిన ఏ పార్టీలోనూ ఆయనకి సుఖం లేకుండా పోతోందని అనిపిస్తోంది! ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరారు. నిజానికి, ఆయన కాంగ్రెస్ చేరతారనే లీకులు మొదలైన దగ్గర నుంచే.. ఆ పార్టీలో ఒక వైరి వర్గం తెరమీదికి వచ్చేసింది. నాగం చేరికను మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా వ్యతిరేకించారు. కాకపోతే, పార్టీ భవిష్యత్తు అవసరాలు అనే కోణంలో నాగంకు కండువా కప్పించారు ఉత్తమ్..! సరే, పార్టీలోకి వచ్చారు కదా.. ఆయనతో ఇతర నేతలు ఎలాగోలా కలిసిమెలిసి ఉండే పరిస్థితి అయితే కనిపించడం లేదు. తాజాగా నాగంపై డీకే అరుణ తీవ్రమైన విమర్శలే చేశారని చెప్పాలి.
ఆయన టీడీపీలో బలమైన నాయకుడై ఉండొచ్చేమోగానీ, కాంగ్రెస్ కాదని డీకే అరుణ విమర్శించారు. బలంగా ఉన్నంత మాత్రాన బలమైన నాయకుడు అయిపోతారా అంటూ నాగంను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్లో బలమైన నాయకుడు అంటే దామోదర్ రెడ్ది మాత్రమే అని ఆమె అన్నారు. అలాంటి నాయకుడితో నాగం చేరిక గురించి హైకమాండ్ కూడా మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. నాగంను పార్టీకి తీసుకుని రావడం ఒక కుట్రలో భాగమనీ, ఇది పార్టీ మంచికి పనికొచ్చే చర్య కాదన్నారు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు మనస్థాపం చెందిన దామోదర్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమౌతున్నట్టు తనకు తెలిసిందని అరుణ చెప్పారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా తాను కోరానని అన్నారు. దామోదర్ రెడ్డి పడుతున్న ఆవేదనను రాహుల్ గాంధీకి వివరిస్తానని ఆమె స్పష్టం చేశారు. నాగంకు ఇంకా టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదనీ, ఆయన బలమైన నేత అయితే కాంగ్రెస్ లోకి వచ్చి ఉండేవారు కాదు అంటూ అరుణ తీవ్రంగా మండిపడ్డారు.
సో.. ఇదీ పరిస్థితి..! భాజపాలో ఇమడలేక, అక్కడ మాట చెల్లుబాటుకాక నాగం ఉక్కిరిబిక్కిరయ్యారు. భాజపాలో చేరిన తరువాత తనకు స్వతంత్రం లేకుండాపోయిందని అప్పట్లో అనేవారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు! రాహుల్ గాంధీకి జై అన్నారు. కానీ, కాంగ్రెస్ లో కూడా నాగంకు ఉక్కబోత తప్పడం లేదు. నిజానికి, నాగం చేరికను డీకే అరుణ వర్గం మొదట్నుంచీ తీవ్రంగానే వ్యతిరేకిస్తోంది. అయితే, జైపాల్ రెడ్డి వర్గం మద్దతు నాగం ఉందనీ, అందుకే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారనే విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు.. పార్టీలో తన ప్రాభవానికి కత్తెర వెయ్యడం కోసమే జైపాల్ కుట్ర చేస్తున్నారనీ, నాగంను తీసుకొచ్చారని అరుణ భావిస్తున్నారన్నదీ అందరికీ తెలిసిందే. మధ్యలో నాగం ఆగం ఆగం అవుతున్నారన్నది వాస్తవం.