మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రమే కాదు.. ఓడిపోయిన వారూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలి రేసులో ఉంటారంటూ… ప్రచారం జరుగుతున్న డీకే అరుణ భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. ఉరుములేని పిడుగులా.. ఆమె… ఢిల్లీలో ప్రత్యక్షమై.. అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోవడంతో.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మంగళవారం అంతా.. పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. ఆమెను బీజేపీలోకి తెచ్చే ఆపరేషన్‌ను… రామ్‌మాధవ్ నిర్వహించారు. తొలుత… హైదరాబాద్‌లోని డీకే అరుణ ఇంటికి రామ్‌మాధవ్ వెళ్లారు. చర్చలు జరిపారు. ఆమె రాజకీయ భవిష్యత్‌కు అమిత్ షా భరోసా ఇచ్చారు. దీంతో.. బీజేపీలో చేరేందుకు .. వెంటనే ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ కండువా కప్పించేసుకున్నారు.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ ఉనికి లేదు. ఆ విషయం అసెంబ్లీ ఎన్నికలతో తేలిపోయింది. 95 శాతం అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. అయితే.. డీకే అరుణ.. ఏ కారణంతో… బీజేపీలో చేరారన్నదానిపై అనేక రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని… ఆ క్రమంలో తెలంగాణ నుంచి బీజేపీ కోటాలో పదవులు వస్తాయని… భావిస్తున్నారు. అది కేంద్రమంత్రి పదవి కావొచ్చు.. రాజ్యసభ పదవి కావొచ్చు.. ఏదైనా… తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆమె అంచనా వేశారంటున్నారు. ఈ క్రమంలో… అమిత్ షా కూడా… అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే.. బీజేపీనే నయమని.. ఆమె అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో ఆమె కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ అభ్యర్థుల అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న భావనతో ఉన్నారు. అసెంబ్లీ టికెట్ల విషయంలోనూ తన మాట నెగ్గించుకోలేకపోయారన్న అసంతృప్తి ఉంది. అయితే ఆమె టీఆర్ఎస్లో చేరుతారని ఎవరూ అనుకోలేదు. కానీ తెలంగాణ బీజేపీలో పరిస్థితులు ఎలా ఉంటాయో.. అందరికీ తెలుసు. నాగం జనార్ధన్ రెడ్డి అలానే బీజేపీలో చేరి ఎటూ కాకుండా పోయారు. అక్కడ పాతుకుపోయిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలు.. బయట నుంచి వచ్చే వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వరు. మరి.. డీకే అరుణ ఎలా నెట్టుకొస్తారో మరి..!