కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ.. ఇప్పుడు ఎవర్ని సీఎం చేయాలనేది ఆ పార్టీ హైకమాండ్ కు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా ఉన్న మల్లిఖార్జున్ ఖర్గే రేసులో లేరు. పోటీ జరుగుతోంది డీకే శివకుమార్,సిద్దరామయ్యల మధ్యే. ఇటీవల కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని.. సీఎం పదవికి ఎవరు ఎక్కువ చాయిస్ అంటే సిద్దరామయ్య పేరు చెప్పారని రిపోర్టులు వచ్చాయి.
కానీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడానికి ప్రధాన కారణం టీ పీసీసీ చీఫ్ శివకుమార్. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చాలా త్యాగాలు చేశారు. కేసులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో సీఎం పోస్ట్ ఆఫర్ బీజేపీ చేసిందని .. కానీ ఆయన కాంగ్రెస్ లోనే ఉండిపోయారని చెబుతారు. గత పార్లమెంట్ ఎన్నిక్లలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ ఘోరపరాజయం పాలయింది. ఆ తర్వాత డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై వ్యవహరించారు. కాంగ్రెస్ నుంచి చేజారిన నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. ఆయన మనీలాండరింగ్ కేసులు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. డీకే శివకుమార్ జైలులో ఉన్నప్పుడు సోనియాగాంధీ స్వయంగా జైలుకు వెళ్లి పరామర్శించి వచ్చారు. రాహుల్ గాంధీ పాదయాత్రను కర్ణాటక రాష్ట్రంలో విజయవంతం చేయటంలో డీకే శివకుమార్ పాత్ర కీలకం.
మాజీ సీఎం సిద్దరామయ్యకు వ్యక్తిత్వంగా మంచి పేరు ఉంది. కర్ణాటక సీఎం ఎవరు ఉంటే బాగుంటుంది అంటూ చేసిన సర్వేల్లో సిద్దరామయ్యకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 45 శాతానికి పైగా ప్రజలు.. సిద్దరామయ్య సీఎంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. తన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని.. చివరి సారిగా సీఎం అయ్యి.. రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ కామెంట్లు చేశారు. ఈ ఇద్దరిలో ఎవర్ని సీఎం చేయాలన్నది ఇప్పుడు హైకమాండ్ తేల్చుకోలేకపోతోంది.