మే 16న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అంటే పోలింగ్ కి ఇంకా నెలరోజుల సమయం కూడా లేదన్నమాట! అందుకే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లపై వారాల వాన కురిపించేస్తున్నాయి. అక్కడి రాజకీయ పార్టీలు సైకిళ్ళు, మంచాలు, బల్లలు, కుర్చీల స్థాయి ఎప్పుడో దాటిపోయాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు టీవిలు, కంప్యూటర్లు, లాప్ టాపులు, ఫ్రిజ్జులు, ఏసీలు పంచిపెడతామని హామీలు ఇస్తున్నాయి. మద్యనిషేధంపై కూడా పార్టీల మద్య ప్రస్తుతం పోటీ నెలకొని ఉంది.
డిఎండికె పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయ్ కాంత్ ప్రకటించిన హామీలకి అధికార, ప్రతిపక్ష పార్టీలు సైతం దిగ్భ్రాంతి చెందేలాగ ఉన్నాయి. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ఇంకా విడుదల చేయనప్పటికీ, ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక వెబ్ సైట్ల ద్వారా ఆయన అంక హామీలను గుప్పిస్తున్నారు. వాటిలో అన్నిటి కంటే ముఖ్యమైనది పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించి లీటర్ పెట్రోల్ ని రూ.45కి, డీజిల్ రూ.35కి ప్రజలకి అందించడం. రాష్ట్రంలో ఉన్న 12,620 గ్రామాలలో ప్రతీ ఇంటికీ ఒక్కో వ్యక్తి చొప్పున ఆఫీస్ అసిస్టెంటులుగా నియమించి వారికి ఒక్కొకరికీ నెలకి రూ.25, 000 జీతం అందించడం ద్వారా అన్ని గ్రామాలలో ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగు పరచడం. వ్యవసాయంలో మెలుకువలు నేర్చుకోవడానికి ప్రతీ ఏటా 5,000 మంది రైతులను విదేశాలు పంపించడం. రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం.
రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం విధించడం వలన రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీ ఆదాయం కోల్పోతుంది. అటువంటప్పుడు వేరే మార్గాలలో ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంటుంది. లేకుంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. కానీ తమిళనాట రాజకీయ పార్టీలన్నీ భారీగా డబ్బు ఖర్చయ్యే హామీలనే గుప్పిస్తున్నాయి.
పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై నియంత్రణ పెట్రోలియం సంస్థలకే ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకి కాదు. ఒకవేళ విజయ్ కాంత్ ఆ ధరలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలనుకొంటే, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. మద్యం వలన వచ్చే ఆదాయం వదులుకోవడమే కాకుండా పెట్రోలియం ఉత్పత్తులను అంత చవకగా ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని కూడా భరిస్తానని విజయ్ కాంత్ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
అది సరిపోదన్నట్లు 12,620 గ్రామాలలో ప్రతీ ఇంటికీ ఒకఉద్యోగం ఇస్తానని హామీ ఇస్తున్నారు. గ్రామానికి ఒక్క ఉద్యోగమే ఇవ్వాలన్నా కూడా 12,620 మందికి ఇవ్వాల్సి ఉంటుంది. వారికి నెలకి 25, 000 జీతం ఇవ్వాలంటే నెలకి రూ.31.50 కోట్లు ఉండాలి. కానీ అదే ఒక్కో గ్రామం 25-100మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎంత డబ్బు అవసరం ఉంటుంది? దానిని విజయ కాంత్ ఎక్కడి నుంచి తీసుకు వస్తారు? అనే సందేహం కలగడం సహజం.
ఏడాదికి 5,000 మంది రైతులను ఫారిన్ పంపించడం అంటే చిన్న విషయం కాదు. ఒక రైతుని ఫారిన్ పంపించడానికి కేవలం రూ.25,000 మాత్రమే ఖర్చవుతుందనుకొన్నా 12.50 కోట్లు కావాలి. కానీ అంతకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువే అవసరం ఉంటుందని చెప్పవచ్చు. మరి అంత డబ్బు విజయ్ కాంత్ ఎక్కడి నుంచి తేవాలనుకొంటున్నారో? ఏమో? ముందు ఎన్నికలలో గెలిస్తే ఆ తరువాత వాటి గరించి ఆలోచించుకోవచ్చునని భావిస్తున్నారేమో?