తమిళ చిత్రసీమ ‘కెప్టెన్’ అంటూ ముద్దుగా పిలుచుకొనే విజయ్ కాంత్ ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు.
27 ఏళ్ల వయసులో నటుడిగా తెరంగేట్రం చేశారు విజయ్‌కాంత్. ‘ఇనుక్కు ఇలమై’లో ప్రతినాయకుడిగా నటించారు. ఆ తరవాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయన వందో చిత్రం ‘కెప్టెన్ ప్రభాకర్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. ‘జదిక్కోరు నీది’, ‘శివప్పు మల్లి’ చిత్రాలు ఆయన్ని విప్లవ కథానాయకుడిగా నిలబెట్టాయి. ఒకానొక దశలో రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలతో ధీటుగా విజయ్‌కాంత్ సినిమాలు ఆడేవి. పోలీస్ పాత్రలకు కొన్నాళ్లు విజయ్ కాంత్ కేరాఫ్ గా నిలిచారు. ఆ సినిమాలు తెలుగులోనూ మంచి ఆదరణ పొందాయి. దాదాపు 150 చిత్రాల్లో విజయ్ కాంత్ నటిస్తే అందులో 50 చిత్రాల్లో పోలీస్ పాత్రలే పోషించారు. విజయ్‌కాంత్ దర్శకుడు కూడా. ‘విరధగిరి’ చిత్రం కోసం ఆయన మెగాఫోన్ పట్టారు. 2005లో డీఎండీకే పార్టీ స్థాపించారు. రెండు పర్యాయాలు ఎం.ఎల్.ఏగా గెలిచారు. ఓసారి ఓడిపోయారు. ఆయన చివరి చిత్రం ‘సగప్తం’.