ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ‘సన్ రైజ్ స్టేట్’ అని వర్ణిస్తుంటారు. సన్ రైజ్ అంటే తన సన్ నారా లోకేష్ అని అర్ధం చేసుకోవాలని ప్రతిపక్షాలు కుళ్ళు జోకులు పేల్చుతుంటాయి. లోకేష్ ని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో ప్రతిపక్షాలు ఎంత కుళ్ళుకున్నా అది జోక్ కాది నిజమేనని అర్ధమవుతోంది.
తమిళనాడులో డిఎంకె పార్టీ గుర్తు కూడా ‘రైజింగ్ సన్’ అంటే ‘ఉదయించే సూర్యుడు’ అని ఆ పార్టీ వాళ్ళు చెప్పుకొంటుంటే, కాదు…‘రైజింగ్ సన్’ అంటే కరుణానిధి చిన్న కొడుకు స్టాలిన్ ‘పొలిటికల్ రైజింగ్’ అని అధికార పార్టీ కుళ్ళు జోకులు వేస్తుంటుంది. కానీ అక్కడ కూడా ‘రైజింగ్ సన్’ అంటే అర్ధం ‘స్టాలిన్ రైజింగే’ అని, అతనిని తన రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించినపుడు జనాలకి అర్ధమయింది.
ఈ ‘రైజింగ్ సన్’ విషయంలో తెదేపానే ఆదర్శంగా తీసుకొన్న కరుణానిధి త్వరలో జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడం కోసం తెదేపా అమలుచేసిన సక్సెస్ ఫుల్ ఫార్మూలనే అమలుచేసి అధికారంలోకి రావాలనుకొంటున్నారు. కరుణానిధి నిన్న విడుదల చేసిన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పంట రుణాలన్నిటినీ మాఫీ చేసేస్తామని హామీ ఇచ్చేరు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోలాగే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చేరు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యనిషేధం అమలుచేయబోతున్నట్లు ప్రకటించాలని కరుణానిధి అనుకొన్నారు కానీ, ఆయన కంటే ‘రెండాకులు’ ఎక్కువే చదివిన ముఖ్యమంత్రి జయలలిత తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దశలవారిగా మద్యనిషేధం అమలుచేస్తామని ప్రకటించేశారు. కనుక కరుణానిధి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చేసారు.
పంట రుణాల మాఫీ చేయడం ఎంత ధనిక రాష్ట్రానికయినా తలకుమించిన భారమేనని రుజువయినప్పటికీ, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ఏవిధంగా వదిలించుకోవచ్చనే దానిపైనా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఫార్ములాలను చాలా చక్కగా అమలుచేసి చూపిస్తున్నాయి కనుక వాటిని కూడా హామీతో బాటు అడాప్ట్ చేసుకొని అమలు చేస్తే ఆ సమస్య నుంచి గట్టెక్కడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే కరుణానిధి చక్రాల కుర్చీలో కూర్చొని చాలా దైర్యంగా హామీ ఇచ్చేసారు. కనుక ఇంక ఓటర్లే డిసైడ్ చేసుకోవాలి.