తమిళనాడు అధికార పార్టీ డీఎంకే పవన్ కల్యాణ్ విషయంలో ఉలిక్కి పడుతోంది. తామ రాష్ట్రానికి సంబంధం లేని రాజకీయ నేత మళ్లీ తమను ఇబ్బందుల్లో నెడుతున్నారని తెలుసుకుని ఏం చేయాలో తెలియక మరిన్ని తప్పులు చేస్తోంది. పవన్ కల్యాణ్ డీఎంకేను మరింతగా ట్రాప్ లోకి లాగుతున్నారు. తాజాగా ఆయన అన్నాడీఎంకే కు బూస్ట్ ఇస్తే.. ఎంజీఆర్ ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇది తమిళనాడులో వైరల్ అయిపోయింది. ఆ ట్వీట్‌కు పవన్ పెట్టిన ఫోటో కూడా ప్రత్యేకమే. ఎంజీఆర్‌ను దేవుడిగా కొలుస్తారని ఓ వారపత్రికలో వచ్చిన వార్త అది. దేవుడ్ని నమ్మని భావజాలం నుంచి వచ్చిన పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే.
తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ … గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని స్పష్టం చేశారు. ఇది హిందువులపై జరుగుతున్న దాడిగా మారుతూండటంతో డీఎంకే ఆచితూచి స్పందించింది. తాము ఎవరినీ నిందించలేదని కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్ .. వెయిట్ అండ్ సీ అని స్పందించారు. అయితే మధురైలో పవన్ పై ఓ కేసు పెట్టించారు. డీఎంకే సోషల్ మీడియా మొత్తం పవన్ పై దృష్టి పెట్టింది. కానీ ఇలా చేయడం డీఎంకేకు వేలికి అంటించుకున్నదాన్ని ముక్కుకు అంటించుకోవడం లాంటిదేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.
తమిళనాడులో ఇప్పుడు మరోసారి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ జరుగుతోంది. పవన్ ద్వారా ఈ మాటలపై మరోసారి చర్చకు కారణం అవుతుంటే వాటిని మరింత చర్చకు పెట్టేలా డీఎంకే వ్యవహరిస్తోంది. ప్రకాష్ రాజ్ వంటి వారిని తమ కార్యక్రమాలకు పిలిపించి పవన్ పై పరోక్ష విమర్శలు చేయిస్తోంది. తమిళనాడులో బేస్ కోసం బీజేపీ చాలా కాలంగా హిందూత్వ జెండాను ఉపయోగిస్తోంది. కానీ ప్రయోజనం ఉండంటం లేదు. ఓ మంచి సమయం కోసం చూస్తోంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పవన్ కల్యాణ్ ద్వారా కల్పించుకున్నట్లయింది. ఈ టాపిక్ డీఎంకే ఎంత పెద్దది చేసుకుంటే.. అంతగా… ఇబ్బంది పడుతుంది. పవన్ కోరుకునేది కూడా అదేనేమో ?