అదేంటీ… తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ లు చెన్నైలో భేటీ అయితే మధ్యలో వైకాపా వ్యూహమేంటి అనిపిస్తోందా..! ఉంది, వారు తిప్పాల్సిన చక్రం వారూ తిప్పారట! కానీ స్టాలిన్ ప్రకటన సూటిగా స్పష్టంగా ఉండేసరికి, ఇదేంటీ… కథ ఇలా అడ్డం తిరిగిందని జగన్ క్యాంపు షాక్ లో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ, కేసీఆర్ – స్టాలిన్ భేటీ మధ్యలో వైకాపా పాత్ర ఏంటనే కదా అనుమానం? నిజానికి, కేరళ సీఎం పినరయి విజయన్ భేటీ అయిన వెంటనే, స్టాలిన్ తో చర్చలకు వెళ్లాలని కేసీఆర్ భావించారు. కానీ, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న కాంగ్రెసేతర భాజపాయేతర సూత్రాన్ని స్లాలిన్ లైట్ తీసుకున్నారు. అది ఆచరణ సాధ్యం కాదులే అంటూ భేటీ వద్దులే అనుకున్నారట! సరిగ్గా ఆ సమయంలోనే వైకాపా నుంచి ఆయనకో మెసేజ్ వెళ్లినట్టు తెలుస్తోంది.
అదేంటంటే… తొందరపడి మనం ఏదో ఒక పార్టీకి మద్దతు ఇచ్చేస్తున్నట్టు ప్రకటించొద్దనీ, తద్వారా జాతీయ రాజకీయాల్లో బేరమాడే శక్తిని మనకి మనమే తగ్గించుకున్నట్టు అవుతుందన్నది ఆ సందేశం సారాంశంగా తెలుస్తోంది. మాయావతి, మమతా బెనర్జీ లాంటివాళ్లు జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పేసి, ఏకంగా ప్రధాని పదవి కోసం పావులు కదుపుతూ ఉంటే.. మనం మాత్రం ఎందుకు వెనకబడాలనీ, గట్టిగా ఓ వంద సీట్లను మనం ఒక చోటికి చేర్చి కూటమి కడితే… జాతీయ పార్టీలు కూడా మన మద్దతు కోసం కాళ్ల దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుందని స్టాలిన్ కి వైకాపా సందేశం అందిందట! కేసీఆర్ వచ్చినంత మాత్రాన కమిట్ అయిపోయినట్టు కాదనీ, వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న సాధ్యాసాధ్యాల సమాచాలోచనలకు ఇదొక వేదికగానే భావించాలని కోరారట! దీంతో, మొదట వద్దనుకున్నా… ఓసారి కలిస్తే పనైపోతుందని కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ ఓకే అన్నారట!
దీంతో, తమ ఎత్తుగడ వర్కౌట్ అయిందీ, చంద్రబాబు నాయుడుకి సమాంతరంగా కేసీఆర్ ద్వారా తామూ జాతీయ రాజకీయాలు చెయ్యొచ్చనే ఒక ఆశాభావం వైకాపా శ్రేణుల్లో వ్యక్తమైనట్టు సమాచారం! అయితే, తీరా కేసీఆర్ తో భేటీ అయిన స్టాలిన్… భాజపా, కాంగ్రెస్ లు లేని ఫ్రెంట్ కు తాను ప్రాధాన్యత ఇవ్వలేనని చెప్పేయడంతో… గాలి తీసేసినట్టు అయిపోయింది. కాంగ్రెస్ కి మీరూ మద్దతు ఇవ్వొచ్చుగా అని కేసీఆర్ తో స్టాలిన్ అనేయడంతో తత్వం బోధపడ్డట్టయింది! ఇదేంటీ… తాము ఏదోదో లెక్కలేసుకుంటే, స్టాలిన్ ఇలా చేశారనే ఆశ్చర్యంలో వైకాపాకి చెందిన కొందరు ప్రముఖ నేతలున్నారట! మరీ ముఖ్యంగా… స్టాలిన్ తో రాయబారం నడపటంలో క్రియాశీలక పాత్ర పోషించానని భావించిన ఓ ప్రముఖ నేత… తాజా పరిస్థితిపై తీవ్ర మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎంతైనా… రాజకీయాలు చేయడమంటే ఫిర్యాదులు రాయడం, విమర్శలు చేయడం మాత్రమే అనుకుంటే సరిపోదుగా..!!