తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చెన్నైకి వెళ్లి స్టాలిన్ ను కలిసి వచ్చిన వెంటనే… డీఎంకే నేత దొరై మురుగన్.. అమరావతికి వచ్చారు. కేసీఆర్ తో జరిపిన చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు .. ఆయన వివరించినట్లు సమాచారం. కేసీఆర్ తో జరిగిన భేటీలో స్టాలిన్ తో పాటు దొరై మురుగన్ కూడా ఉన్నారు. బీజేపీయేతర కూటమి పార్టీలను సమైక్యంగా ఉంచడానికి ..ఏకతాటిపైకి తీసుకురావడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో… కేసీఆర్ తో జరిగిన భేటీపై ఎలాంటి అపోహలు రాకుండా ఉండటానికి దొరైమురుగన్… వచ్చి భేటీ వివరాలు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ భేటీ మర్యాదపూర్వకమే..!
అదే సమయంలో..స్టాలిన్ చెన్నైలో.. కేసీఆర్ తో జరిగిన సమావేశాన్ని జస్ట్ ఓ మర్యాదపూర్వక భేటీగా మాత్రమే తేల్చారు. కేసీఆర్ మూడో కూటమి చర్చలకు రాలేదని..కేవలం ఆలయాల సందర్శనకు మాత్రమే వచ్చారని… మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని..స్టాలిన్ స్పష్టం చేశారు. దేశంలోప్రస్తుతం మూడో ఫ్రంట్‌కు అవకాశాలు లేవని.. ఏదో ఓ జాతీయ పార్టీ అధ్వర్యంలోని కూటమిలోనే ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన పరిస్థితి ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు. పైగా.. కేసీఆర్
ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని కానీ.. మద్దతు ఇవ్వాలని కానీ తనను కోరలేదని స్టాలిన్ ప్రకటించారు.
చంద్రబాబుకు డీఎంకే దూత ఏం చెప్పారు..?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనలు చేశారు. ఆ సమయంలో.. మొదటగా ఆయన ఒడిషాకు వెళ్లి.. అక్కడ సీఎం నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. కేసీఆర్.. భేటీ అయిన తర్వాతి రోజే… ఓ దూతను…నవీన్ పట్నాయక్ ..చంద్రబాబుకు వద్దకు పంపించి…సమావేశ వివరాలు వెల్లడించారు. ఇప్పుడు.. కేసీఆర్ తమిళనాడు పర్యటనకు వెళ్లిన తర్వాత .. డీఎంకే అధినేత కూడా…అలాగే ఓ దూతను…చంద్రబాబు వద్దకు పంపి..చర్చల వివరాలు వెల్లడించడం.. రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ఫెడరల్ ఫ్రంట్ గురించే మాట్లాడలేదన్న స్టాలిన్..!
ఏ ఫ్రంట్‌కు అయినా వంద సీట్లు తగ్గుతాయన్న ఉద్దేశంలో ఉన్న కేసీఆర్… కొన్ని ప్రాంతీయ పార్టీలను కూడగట్టి.. కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసమే ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే స్టాలిన్ మాత్రం..తనతో అలాంటి చర్చలు కేసీఆర్ జరలేదంటున్నారు. రెండు విడతలుగా చేసిన ప్రయత్నాలు విఫలమయినప్పటికీ..కేసీఆర్… మళ్లీ మళ్లీ ఆ నేతలతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మరోసారి నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మాయావతిలతోనూ…కేసీఆర్ భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో… స్టాలిన్ వ్యాఖ్యలు కేసీఆర్ కు..ఇబ్బందికరమే..!