హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి ఘోర పరాభవం ఎదురయిన సంగతి తెలిసిందే. 243 స్థానాలకుగానూ మహాకూటమి 178 స్థానాలలో విజయం సాధించగా, ఎన్డీఏ కూటమి 58 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీకి ఇలాంటి ఫలితం ఎదురవుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ముందే తెలుసన్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది.
బీహార్ ఎన్నికలు ప్రధానమంత్రి మోడి పనితీరుకు, కేంద్ర ప్రభుత్వం పనితీరుకు రిఫరెండం కాదని ఆయన మూడో దశ పోలింగ్ జరిగే రోజే చెప్పారు. బీహార్లో వ్యతిరేక ఫలితం వస్తే కేంద్రం చేపట్టాలనుకుంటున్న సంస్కరణలకు, విధానాలకు బ్రేక్ పడుతుందన్న వాదనను అమిత్ షా కొట్టిపారేశారు. పార్లమెంట్లో తమకు స్పష్టమైన మెజారిటీ ఉండగా, బీజేపీ విధానాలకు ఈ ఎన్నికలలో జయాపజయాలతో సంబంధం ఉండదని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
సాధారణంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పల్స్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అధికార పార్టీలకు ముందే తెలుస్తూ ఉంటుంది… ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలకు. అందుకే వారు, తమకు వ్యతిరేక ఫలితం వస్తుందనుకుంటే, ఆ ఎన్నికలు తమ పనితీరుకు రిఫరెండం కాదని చెబుతారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకుముందు వెంకయ్య నాయుడు ఇదే మాట చెప్పారు. అలాగే, ఇటీవలి బీహార్ ఎన్నికల గురించి కూడా అమిత్ షా ఇదే మాట చెప్పి ఫలితాన్ని ముందే చెప్పేశారు.