ముగిసిపోయిందీ అనుకున్న చర్చకు మళ్లీ తెర లేచినట్టయింది! అదేనండీ… తెరాస నాయకుడు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ పార్టీ మార్పు విషయం. ఈ మధ్య ఇదే అంశమై రకరకాల ఊహగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన స్పందించిన సంగతీ తెలిసిందే. మీడియాకి క్లాస్ తీసేసుకున్నారు కూడా. వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాసే రాతల్ని ఏ తరహా జర్నలిజం అంటారంటూ ప్రశ్నించేశారు! తాను తెరాసను విడిచి పెట్టనని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదంటూ ఒంటికాలిమీద లేచారు. తనమీద లేనిపోని అబాంఢాలు వేస్తే చట్టపరంగా చర్యలకు దిగాల్సి ఉంటుందన్న రేంజిలో హెచ్చరించారు! ఇంత వివరణ ఇచ్చుకున్న డీఎస్.. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తన కుమారుడు భారీ ఎత్తున పత్రికలకు ఇచ్చిన ప్రకటనలపై ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
నిజామాబాద్ జిల్లా ఎడిషన్లలో పంద్రాస్టు సందర్భంగా డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ పేరుతో కొన్ని ప్రకటనలు వచ్చాయి. ఇంతకీ ఆ ప్రకటనలు ఏంటంటే.. ‘జాతి మొత్తం మోడీ వెంటే నిలవాలి. భరతదేశం జగద్గురువుగ ఎదగాలి. మోడీని బలపరచడమంటే దేశభక్తిని నిరూపించుకోవడమే’ అంటూ ప్రకటనలు ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు మోడీ, అఖండ భారత అజేయ శక్తి మోడీ అంటూ కీర్తిస్తూ ఈ ప్రకటనలు దర్శనమిచ్చాయి. దీంతో డీఎస్ పార్టీ మార్పుపై మళ్లీ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి, తన కుమారుడి విషయంలోనే డీఎస్ పంతానికి పోతున్నారనీ, వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం తన కొడుక్కి ఇవ్వాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంచితే ఆయన స్పందించడం లేదనీ, ఇదే సాకుతో డీఎస్ పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు కథనాలు వచ్చాయి. సరే, అవన్నీ కట్టుకథలని డీఎస్ కొట్టి పారేశారు.
అయితే, ప్రస్తుతం వినిపిస్తున్నది ఏంటంటే… వచ్చే ఎన్నికల్లో డీఎస్ కుమారుడికి నిజామాబాద్ ఎంపీ టిక్కెటు భాజపా నుంచి దక్కే అవకాశం సుస్పష్టం అని! కుమారుడితోపాటు తండ్రి డీఎస్ కూడా కమలదళంలో చేరే అవకాశం ఉందనీ, ఆయనకీ ఓ ఆఫర్ ఉన్నట్టు తాజా కథనం. డీఎస్ కు రాజ్యసభ సీటుతోపాటు, వీలైతే మంత్రి పదవి ఇస్తామని కూడా ఎరజూపినట్టు జర్నలిస్టుల వర్గాల్లో వినిపిస్తోంది. మరి, తాజా పరిణామాలపై డీఎస్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి? తన కుమారుడు పార్టీ మార్పుతో తనకేంటి సంబంధం అంటూ డీఎస్ ఉల్టా ప్రశ్నిస్తారేమో! లేదంటే, కుమారుడు ఇచ్చిన ప్రకటనల్ని సమర్థించుకుంటూ… పంద్రాగస్టు కాబట్టి దేశభక్తితో అలా యాడ్స్ ఇచ్చాడనీ, అందులో రాజకీయ సంబంధమైన వాక్యాలు ఏమున్నాయని సమర్థించుకుంటారేమో! దేశభక్తి అంటే దాని గురించే మాట్లాడాలి కదా! కానీ, ఆయన ఇచ్చిన ప్రకటనల్లో మోడీ అంటే తనకున్న భక్తి ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తోంది.