`మిమ్మల్ని మెప్పించే సినిమా తీయలేకపోయా.. మీ అంచనాల్ని అందుకోలేకపోయా` అంటూ రామ్చరణ్ అభిమానులకు బహిరంగంగా ఓ లేఖ రాశాడు. `వినయ విధేయ రామ` ఫ్లాప్ అవ్వడంతో – భారీ నష్టాలు చవిచూడడంతో చరణ్ ఇలా స్పందించాల్సివచ్చింది. చరణ్ లేఖ సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ అయ్యింది. పరాజయాల్ని ఒప్పుకోవడానికి గట్స్ ఉండాలని, అది చరణ్లో కావల్సినంత ఉందని.. మెగా అభిమానులు మెచ్చుకుంటున్నారు. నిజంగానే ఓ ఫ్లాప్ ని ఫ్లాప్ అని ఒప్పుకోవడం, ఇలా ఓ లేఖ రాయడం – అభినందించదగిన విషయాలే.
కానీ చరణ్ లేఖ పట్ల దర్శకుడు బోయపాటి శ్రీను గుర్రుగా ఉన్నాడని టాక్. లేఖ విషయంలో తన సలహా తీసుకోకపోవడం, ఉత్తరంలో ఎక్కడా తన పేరు ప్రస్తావించకపోవడం బోయపాటి అలకకు కారణమని తెలుస్తోంది. చరణ్ కూడా.. నిర్మాత డివివి దానయ్య పేరు ప్రస్తావించాడు తప్ప… బోయపాటి ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు. ఇప్పటి వరకూ బోయపాటి ఖాతాలో ఇలాంటి ఫ్లాప్ లేదు. `దమ్ము` ఫ్లాపే. కానీ… తరవాతి కాలంలో బోయపాటి దాన్ని `యావరేజ్`గా చూపించుకున్నాడు. ఈ ఫ్లాప్నీ బోయపాటి `యావరేజ్`గా కవర్ చేసుకోవడానికి చరణ్ వీలు లేకుండా చేశాడు.
`వినయ విధేయ రామ` తరవాత చరణ్-బోయపాటి మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. సినిమా విడుదల తరవాత… వీరిద్దరూ కనీసం ఒక్కసారి కూడా పలకరించుకోలేదట. అందుకే చరణ్ లేఖ విషయంలో సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. సినిమా అనేది సమష్టి కృషి అని – ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మిగిలిన వాళ్ల అభిప్రాయాలూ తీసుకోవాలని బోయపాటి తన సహచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. మొత్తానికి బోయపాటి ఖాతాలో తొలి డిజాస్టర్ని డిక్లేర్ చేసేశాడు చరణ్.