రాంగోపాల్ వర్మకి ఎదురెళ్లడం అంటే కొరివితో తలగోక్కోవడమే. అందుకే ఆయనేమన్నా పడడం, నవ్వి ఊరుకోవడం, వర్మ అంతేలే అనుకుని లైట్ తీసుకోవడం మాత్రమే అలవాటు చేసుకున్నారు. మొదటిసారి అల్లు అరవింద్… వర్మపై తిరుగులేని బాణాల్ని సంధించాడు. నీచుడు, క్రిమినల్ లాంటి పెద్ద పెద్ద పదాలతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకూ కాస్టింగ్ కౌచ్ వివాదంపై పెట్టిన ప్రెస్ మీట్లు, ఇచ్చిన స్పీచులూ ఒక ఎత్తు.. వర్మపై అల్లు అరవింద్ నిప్పులు చెరగడం మరో ఎత్తు. వర్మని దోషిగా నిలబెడుతూ… అరవింద్ మాటల తూటాల్ని పేల్చేశాడు. అరవింద్ మాటల్లో నిజం ఉంది, లాజిక్కూ ఉంది. దీనికి వర్మ ఎలా స్పందిస్తాడన్న విషయం పక్కన పెడితే… అసలు అరవింద్ టార్గెట్ ఏమిటన్నది ప్రస్తుతం చిత్రసీమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అరవింద్ మాటల్ని బట్టి చూస్తే వర్మని టాలీవుడ్ నుంచి బహిష్కరించడమే ప్రధాన వ్యూహం అనిపిస్తోంది.తెలుగు సినిమా నిన్ను పెంచి పోషిస్తే.. ఆ తల్లి పాలు తాగి రొమ్ము కరుస్తావా? అంటూ సూటిగా ప్రశ్నించడం వెనుక ఉద్దేశం ఇదే కావొచ్చు. చిత్రసీమ అంతా తలవొంచుకోవడానికి వర్మ ఓ భాగమయ్యాడు.. అని చెప్పడం తప్పంతా అటు వైపుకి చూపించే ప్రయత్నమే. ఓదర్శకుడు.. ఓ కథానాయకుడ్ని దూషించడానికి ఓ నటిని ఎరగా వాడుకోవడం, దాన్ని నిర్లజ్జగా ఒప్పుకోవడం అనేది టాలీవుడ్లోనే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమలోనే లేదు. ఆ రకంగా చూస్తే వర్మ పెద్ద తప్పు చేసినట్టే. దీన్ని ఆయుధంగా మలచుకోవాలన్నది అల్లు అరవింద్ వ్యూహం కావొచ్చు. `వర్మపై సినిమా పెద్దలు తగిన చర్య తీసుకోవాలి` అనేది అరవింద్ డిమాండ్. ప్రస్తుతం టాలీవుడ్లో చక్రం తిప్పగల మేధావి అరవింద్. ఆయన తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. మరి వర్మపై టాలీవుడ్ సహాయ నిరాకకరణకు అరవింద్ వ్యూహం రచిస్తారా? దానికి ఈ ప్రెస్ మీటే తొలి అడుగు అనుకోవచ్చా?? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.