పాతికేళ్ల పాటు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్య బాధ్యతలు నిర్వహించి, ఆగమ సలహాదారులగా వ్యవహరించిన రమణదీక్షితులు.. కొద్ది రోజులుగా అలజడి రేపుతున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల వచ్చారు. ఆ రోజున రమణ దీక్షితులు ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ… సైలెంట్‌గా చెన్నై వెళ్లి తమిళ మీడియాతో టీటీడీపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ప్రధాన అర్చకునిగా ఉన్న ఆలయంపైనే ఆగమ నిబంధనలు, పూజా కైంకర్యాలపై ఆరోపణలు చేశారు. అన్నింటికీ బాధ్యులు టీటీడీ అధికారులేనన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి.. శ్రీవారి నగలు పోయాయన్న అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. తర్వాత విజయవాడలోనూ సమావేశం పెట్టి అంతకంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓ ప్లాన్ ప్రకారం.. శ్రీవారి ఆలయం నిర్వహమ అధ్వాన్నంగా ఉందని… ఆయన అభరణాలకూ భద్రత లేదన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రమణ దీక్షితులు ప్రయత్నించారు. దీనికి టీటీడీ ఈవో వివరణ ఇచ్చారు. జీయర్ల ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. రమణ దీక్షితులు లేవనెత్తిన అన్ని అంశాలకూ క్లారిటీ ఇచ్చారు.
శ్రీవారి ఆభరణాల విషయంలో గతంలో వివాదాలు వచ్చాయి. ముందు ముందు ఇలాంటి వివాదలకు పుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వాధ్వా నేతృత్వంలో ఓ కమిటీ నియమించారు. ఈ కమిటీలో పీవీఆర్కే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వర రావు , మాజీ డీజీపీ ప్రభాకర రావు, మాజీ ఈవో వెంకటపతిరాజు, జస్టిస్ జగన్నాధరావులు ఉన్నారు. వీరు అన్నింటిని పరిశీలించి.. శ్రీవారి ఆలయంతో పాటుగా, తిరుచానూరు లో నగలు కూడా అన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పారు. అప్పుడు ప్రధాన అర్చకులు రమణదీక్షితులే. ఆ కమిటీ రమణదీక్షితులతో కూడా మాట్లాడింది. ఆయన కూడా ఇప్పుడు చేస్తున్న ఆరోపణలేమీ చెప్పలేదు. ఎప్పుడో 2001లో పగిలిందని చెబుతున్న రూబీ గురించి కూడా.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి రూబీ పగిలినప్పుడు రమణదీక్షితులే ప్రధాన అర్చకులు. పగిలిన రూబీ ముక్కలు ఉన్నాయని ఈవో సింఘాల్ కూడా ప్రకటించారు.
కేవలం రాజకీయ అజెండాతో.. శ్రీవారి ఆలయంపై ఆధిపత్యం కోసం, ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లేలా చేయడం కోసమే.. రమణ దీక్షితులు ఈ ఆరోపణలు చేస్తున్నట్లు అనుమానాలు రావడంతో సహజంగానే ఆయనకు వ్యతిరేక వర్గం కౌంటర్లు ప్రారంభించింది. బ్రాహ్మణ సంఘాలన్నీ రమణదీక్షితులు ఒక్కడే బ్రాహ్మణుడన్నట్లు..రాజకీయాలు ప్రారంభించడంతో ఒక్కొక్క నిజం బయటకు వస్తోంది. తిరుమలలో మిరాశీ అర్చకులు.. ఎప్పుడూ లేని విధంగా మీడియా సమావేశం పెట్టి.. రమణదీక్షితులు తీరును ఎండగట్టారు. పనిలో పనిగా రమణదీక్షితులు ఆడికారును, సెంట్ కొట్టుకుని ఆలయానికి వస్తారన్న విషయాలను బయటపెట్టడంతో ఆటోమేటిక్‌గా ఆయన ఆస్తుల మీదకు టాపిక్ వెళ్లింది. వెంటనే ఆయన వాడే ఆడి కారు, ఆయన భవనాలు, ఫార్మ్ హౌస్ జాబితా వైరల్ అయిపోయింది. శ్రీవారి సేవనే జీవితంగా చేసుకున్న వ్యక్తి ఇంతగా భోగాలకు అలవాటు పడ్డారా అన్నట్లుగా ఆయనపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.
నిజానికి రమణదీక్షితులు శ్రీవారి ప్రధాన అర్చకులే అయినప్పటికీ.. ఆయన ప్రైవేటు సేవలకే ఎక్కువ సమయం కేటాయిస్తారన్న ఆరోపణలున్నాయి. వీఐపీలు వస్తే వారి సేవల్లో మునిగి తేలుతారని అంటారు. గతంలో శ్రీవారికి భక్తులు ఇచ్చిన సొమ్మును సొంత అకౌంట్లో వేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నిజమని తేలడంతో ఆయన కొంత సొమ్ము వెనక్కి ఇచ్చేశారట. ఇప్పుడు ఆయన వ్యవహారాలపై తిరుమల అర్చకులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. రమణదీక్షితులు ఏ ఉద్దేశంతో రగడ ప్రారంభించారో కానీ.. ఇప్పుడది ఆయన పాత వ్యవహారాలను బయటకు లాగుతోంది.