“నేను చేస్తున్నది నా వ్యక్తిగత పోరాటం కాదు. మీ కోసం, రాష్ట్రం కోసమే నేను ఉద్యమిస్తున్నాను. నా చుట్టూ వలయంగా ఉండి మీరే కాపాడాలి. ప్రజలే నాకు రక్షణ కవచం” .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు ఇవి. ఓ ముఖ్యమంత్రి తన మీద కుట్ర జరుగుతోందని..ప్రజలే అండగా నిలబడాలని పిలుపునివ్వడం..అదీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొంత సంచలనమే. బీజేపీతో వైసీపీ, జనసేన లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని…టీడీపీని, ప్రభుత్వాన్నే కాదు… వ్యక్తిగతంగా కూడా చంద్రబాబును టార్గెట్ చేశారని..ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు తరచుగా ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ప్రకటనలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. సోము వీర్రాజులాంటి నేత… 2019లో అలిపిరి లాంటి ఘటన పునరావృతమవుతుందని ప్రకటించారు. ఇది టీడీపీ నేతల్లో అనుమానాలను మరింత పెంచింది.
కానీ కాస్త లాజికల్ గా ఆలోచిస్తే..ఓ రాష్ట్ర ప్రభుత్వంపై కానీ.. దాని అధిపతిపై కానీ కేంద్రం.. ఏకపక్షంగా ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని భావించవచ్చు. ఓ ప్రభుత్వానికి సంబంధించి పనుల్లో ఏమైనా అవకతవకలు జరిగితే.. కేంద్రం తన ఇష్టం వచ్చినట్లుగా విచారణకు ఆదేశించుకోవడానికి లేదు. అలా అని వ్యక్తిగతంగా దాడులు చేసే సాహసం చేసే ప్రయత్నం కూడా అసాధ్యం. కానీ ముఖ్యమంత్రి టీడీపీ నేతలు మాత్రం.. ఏదో కుట్ర జరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు. దాన్ని విస్త్రతంగా ప్రచారంలోకి పెడుతున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే.. రాజకీయాల్లో ఆయన ఎలాంటి స్టెప్ వేయడానికైనా వెనుకాడరని చంద్రబాబు అంచనాకొచ్చినట్లు టీడీపీ నేతలు భావిస్తున్నాయి. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా ఆయన వ్యూహం ఉందని చెబుతున్నారు. ఒకటి..ముందు నుంచే… తమపై కుట్ర జరుగుతున్నదని ఆరోపిస్తూ ఉంటే… కేంద్రంలో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే .. మానుకుంటుంది. ప్రత్యేకహోదా కోసం పట్టుబడుతున్నారనే కేసుల్లో ఇరికించారనే చెడ్డ పేరు మోదీకి వస్తుంది. అందుకే వెనుకడుగు వేస్తుంది. రెండోది.. సానుభూతి సంపాదించుకోవడం… ఒకవేళ పక్కా సాక్ష్యాలుండి.. కేంద్రం ముందుకు వెళ్లినా… ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేక భావన వస్తుంది. అన్ని కేసులున్నా జగన్ ను.. కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ… ఏపీ కోసం కష్టపడుతున్న చంద్రబాబుపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలను చంద్రబాబు అమలు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
రాజకీయ వ్యూహాల్లో చంద్రబాబును మించిన వారు కాదు మోదీ. తనకు ఎదురులేదనే తత్వంలో… అడ్డదిడ్డమైన నిర్ణయాలను మోదీ తీసుకుని విమర్శల పాలవుతరాని.. నోట్ల రద్దు, జీఎస్టీలాంటి విషయాల్లో బయటడింది.అదే సమయంలో చంద్రబాబు ఎలాంటి సమయంలోనే అయినా… ఆలోచించి …రాజకీయ ప్రయోజనాలను అంచనా వేసుకున్న తర్వాతే ముందడుగు వేస్తారన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యనే గేమ్ నడుస్తోంది. పై చేయి ఎవరిదో కాలం తేలుస్తుంది..!