ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శాసనమండలి సభ్యుల ఖాళీలు అయితే వెంటనే భర్తీ చేస్తున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇలా ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేస్తున్నప్పుడల్లా… అందరికీ ఒకటే గుర్తుకు వస్తోంది. అదే అసెంబ్లీలో చేసిన మండలి రద్దు తీర్మానం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జూన్ కల్లా.. తమకు శాసనమండలిలో పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందని తెలిసి కూడా రద్దు చేయడానికి సిద్ధమవుతున్నామని… శాసనమండలి అనేది పూర్తిగా పనికి మాలినదని ఆయన తేల్చారు. నిబంధనలకు అనుగుణంగా మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం పార్లమెంట్ లో బిల్లుగా చేసి ఆమోదించి రాష్ట్రపతితో నోటిఫికేషన్ ఇస్తే మండలి రద్దు అయిపోతుంది. కానీ కేంద్రం ఇంత వరకూ పట్టించుకోలేదు.
కోవిడ్ కారణంగా పార్లమెంట్ సరిగ్గా నడవని పరిస్థితి ఉంది. అందుకే… మండలి రద్దు లాంటి అత్యవసరం కాని బిల్లుల విషయంలో కేంద్రం వేచి చూస్తోంది. రేపు… ప్రతిపాదనలన్నింటినీ క్లియర్ చేయాలనుకుంటే ఏపీ మండలిని రద్దు చేస్తూ.. అసెంబ్లీలో బిల్లు పెడుతుంది. పాస్ అవుతుంది. మండలి రద్దు అవుతుంది. అయితే ఇప్పుడు తమ పార్టీ వాళ్లే ఎమ్మెల్సీలుగా ఉంటున్నారు కాబట్టి.. జగన్ ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారా.. అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ ఒక్కటంటే ఒక్క సారి కూడా.. శాసనమండలి రద్దు గురించి మాట్లాడలేదు.
తీర్మానాన్ని ఆమోదించాలని కేంద్రాన్ని కోరినట్లుగా లేదు. ఒక వేళ మండలి రద్దు చేస్తే ఇప్పుడు వైసీపీకే నష్టం. రద్దు చేయవద్దని మళ్లీ తీర్మానం చేసి పంపితే… జగన్ మళ్లీ మడమ తిప్పారని.. అసెంబ్లీలో మండలి గురించి చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు అని అంగీకరించినట్లవుతుందని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి మండలి వ్యవహారం వైసీపీ అధినేతకు ముందు ముందు ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. రేపు ఈ తీర్మానమే… ఆ పార్టీకి కష్టాలు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.