ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మించినవారు మరొకరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు! రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాసరే, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ‘నేనంటే నేను’ అంటూ నేతల కుస్తీ పట్లు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఇదే విషయమై ఎవరిస్థాయిలో వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కథనాలు వినిపించాయి. ఆ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన సీనియర్ నేత జానారెడ్డి, పలువురు పార్టీ నేతల తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జానారెడ్డి పనితీరుపై కూడా ఫిర్యాదుల చిట్టాను కొంతమంది రాష్ట్ర నేతలు ఢిల్లీకి పంపినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు ఆత్మీయ సభకు జానారెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. దీంతోపాటు గతంలో పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరించిన సందర్భాలన్నింటినీ ప్రస్థావిస్తూ ఒక నివేదిక హైకమాండ్ కు చేరినట్టు తెలుస్తోంది.
ఈ మధ్యనే హైదరాబాద్ లో వెంకయ్య నాయుడు ఆత్మీయ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సభలో వెంకయ్యను జానారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. సరిగ్గా ఇదే సమయంలో, యూపీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాల్ కృష్ణ గాంధీ బరిలోకి దిగుతుంటే… ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అభినందిస్తూ జానారెడ్డి మాట్లాడటంపై రాష్ట్రనేతలు మండిపడటం మొదలుపెట్టారు. మధు యాష్కీ, సీనియర్ నేత వీ హనుమంతరావు వంటివారు జానాతీరును తప్పుబట్టారు. ఈ వ్యవహారంతోపాటు… గతంలో ఓసారి తెరాస సర్కారు ప్రవేశపెట్టిన రూ. 5 భోజనాన్ని తెప్పించుకుని తిని, కేసీఆర్ ఆలోచన అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. గ్రేటర్ ఎన్నిక సందర్భంలో ఇలా చేయడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా, సంపత్ తో బలవంతంగా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన సందర్భాన్ని కూడా ఫిర్యాదుల జాబితాలో చేర్చినట్టు సమాచారం. ఇలా వివిధ సందర్భాల్లో పార్టీకి ప్రతికూలంగా వ్యవహరించడంతోపాటు, కేసీఆర్ సర్కారును వెనకేసుకొచ్చిన సందర్భాలను కూడా సోనియాకు పంపిన ఫిర్యాదులో ఉన్నట్టు చెబుతున్నారు.
అయితే, ఈ ఫిర్యాదు విషయం జానాకి తెలిసింది. దీనిపై ఆయన ఘాటుగానే స్పందిస్తున్నారట. తానేం తప్పు చేయలేదనీ, వెంకయ్య నాయుడు అభినందన సభకు వెళ్తే ఇబ్బందిగానీ, ఆత్మీయ సభకు వెళ్లడంలో ఈ విమర్శలేంటని అంటున్నారట. ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నాకనే పొగడ్తలతో ముంచెత్తానని సమర్థించుకున్నారట. తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడతాననీ, నిజంగా పార్టీకి ఇబ్బంది కలిగించేవారు ఎవరో హైకమాండ్ కు తెలుసు అని అంటున్నారట. మరి, జానా వ్యవహారంపై హైకమాండ్ స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.