మార్చి రెండో తేదీన లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్‌పై కేసు నమోదు చేశామని.. సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జన్నార్ అయితే.. పండుగ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెలరేగిపోయారు. ఈ లోపు ఐటీ గ్రిడ్ ఉద్యోగుల కిడ్నాప్, హేబియస్ కార్పస్ పిటిషన్లో కోర్టు మొట్టికాయలు చాలా అయిపోయాయి. అయితే.. హఠాత్తుగా ఇప్పుడు… కొత్తగా.. ఎస్ఆర్ నగర్లో మరో రాంరెడ్డి అనే మరో వైసీపీ నేత దగ్గర్నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. దానిపై మంగళవారం.. సైబరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ సమీక్ష జరిపారు. ఈ విషయం పోలీసు వర్గాలు చెప్పడంతో.. అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఓ వైపు. సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తూంటే.. మరో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కేసు ఎందుకు నమోదు చేశారు..? దానిపై ఏకంగా కమిషనరే ఎందుకు సమీక్ష జరిపారన్నది కీలకంగా మారింది.
లోకేశ్వర్ రెడ్డి చేసిన ఫిర్యాదు చెల్లదన్న భావనతో పోలీసులు వ్యహం మార్చి.. ఐటీ గ్రిడ్ పై మరో వ్యక్తితో ఫిర్యాదు చేయించుకున్నారని చెబుతున్నారు. లోకేశ్వర్ రెడ్డి.. తెలంగాణ ఓటర్. ఆయనకు కూకట్ పల్లి నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. ఆధార్ కార్డు కూడా తెలంగాణలోనే ఉంది. ఏపీ డాటాపై ఫిర్యాదు చేయడానికి ఆయనకు ఎలాంటి అర్హతా లేదు. కనీసం.. తన డాటా చోరీ అయిందని ఆయన ఫిర్యాదు చేయలేరు. పైగా ఈయనకు రాజకీయ లింకులున్నాయి. ఈయన జగన్‌కు సన్నిహిత బంధవు. వైఎస్ జగన్ మేనమామ అయిన రవీంధ్రనాథ్ రెడ్డి సోదరుడు.. చంద్ర ప్రతాప్ రెడ్డి భార్యను లోకేశ్వర్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు. చంద్రప్రతాప్ రెడ్డి …రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వైఎస్ షర్మిల మొదటి భర్త. ఇది కోర్టులో మరోసారి చీవాట్లకు కారణం అవుతుందని వాదించుకోవడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో మరో వ్యక్తితో ఫిర్యాదు తీసుకున్నారు.
ఒకే అంశంపై.. వేర్వేరు కమిషనరేట్ల పరిధిలో.. ఓ సారి దర్యాప్తు చేస్తున్న కేసుకు సంబంధించి.. మరో చోట ఫిర్యాదు తీసుకోవడం అంటేనే… ఓ పెద్ద మిస్టరీని తలపిస్తోంది. ఏదో విధంగా కేసును ఇరికించాలన్నట్లుగా..పోలీసుల వ్యవహారశైలి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా.. ఏ విధంగానూ.. తెలంగాణకు సంబంధం లేని కేసులో.. చట్టంపై అవగాహన ఉండి.. కమిషనర్లుగా చేస్తున్న వారు కూడా.. ఇలా వ్యవహారిస్తూండటమే… ప్రజల్లో ఓ రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొత్తానికి ఈ వివాదంతో పోలీసుల ఇమేజ్ పలుచన అయిపోతోందన్నది మాత్రం నిజం.