తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీగా మారిన డీఎంకే.. పాలనపై దృష్టి కేంద్రీకరించగా… అధికారం కోల్పోయిన అన్నాడీఎంకేలో శశికళ సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు రాజకీయ సన్యాసం ప్రకటించేసిన శశికళ ఇప్పుడు..అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. పార్టీ నేతలతో సమావేశాలు ప్రారంభించారు. అయితే శశికళను పార్టీలోకి రానివ్వబోమని… ఈ పన్నీర్ సెల్వం, ఓ పళనిస్వామి చాలెంజ్‌లు చేస్తున్నారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకేకి వీరిద్దరే అగ్రనేతలు. ఇద్దరూ మాజీ సీఎంలే. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరూ ప్రజాకర్షక నేత కాదు. దీంతో.. పార్టీని కలిపి ఉంచడం వారికి కష్టం అవుతోంది.
ఈ సమయంలో.. కొంత మంది నేతలు శశికళ వైపు చూస్తున్నారు. శశికళ మేనల్లుడు నటరాజన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ.. ఆ పార్టీ ప్రభావం ఇసుమంత కూడా లేదు. దీంతో ఆ పార్టీ గురించి శశికళ ఆలోచించడం లేదు. తాను జైలు నుంచి విడుదలైన తర్వాత అన్నాడీఎంకే జెండాతోనే కనిపిస్తున్నారు. తన వాహనాలకు రెండాకుల గుర్తు ఉన్న జెండాలే వాడుతున్నారు. వివిధ స్థాయిలో అన్నాడీఎంకే నేతలు ఆమెతో టచ్‌లోకి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈపీఎస్, ఓపీఎస్లు తాము శశికళను పార్టీలోకి రానివ్వబోమని.. చాలెంజ్‌లు చేస్తున్నారు. కానీ… శశికళ ఇప్పుడే రాజకీయం ప్రారంభించారు.. ఇంకో రెండు, మూడు నెలలలో మొత్తంగా పార్టీని గుప్పిట్లోకి తీసుకుంటారని… క్యాడర్ మొత్తం ఆమెతోనే నడుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ… శశికళ బాటలో నడవాల్సిందేనని.. లేకపోతే వారిని పార్టీలో ఉండనిచ్చే చాన్స్ లేదని అంటున్నారు. అయితే బీజేపీ హైకమాండ్ మద్దతు తమకే ఉందని… శశికళకు లేదని అన్నాడీఎంకే పెద్దలు నమ్ముతున్నారు. కానీ బీజేపీ రాజకీయం తేడాగా ఉంటుంది. తమకు ఏది లాభమైతే అదే చేస్తుంది. ప్రస్తుతం శశికళ దూకుడు వెనుక.. బీజేపీ ఉందన్న అనుమానాలున్నాయి. అందుకే అన్నాడీఎంకే మళ్లీ శశికళ చేతికి వెళ్లడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.