విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తితో రేగిన సంక్షోభం తాత్కాలికంగా చల్లబడింది. తనపై పార్టీ స్థాయిలోనే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. గంటా శ్రీనివాసరావు మూడు రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలే కాదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. మంత్రివర్గ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. విశాఖ జిల్లాలో జరగబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలోనూ పాల్గొనే అవకాశం లేదన్నట్లుగా.. మీడియాకు సమాచారం పంపారు. ఈ వివాదాన్ని నిన్నటి వరకూ పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి ఈ రోజు మాత్రం గంటా వద్దకు పార్టీ నేతలను పంపారు.
విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి…నిమ్మకాయల చినరాజప్ప… గంటా శ్రీనివాస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖకు చెందిన ఇతర టీడీపీ నేతలూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రితో గంటా శ్రీనివాస్ ఫోన్లో మాట్లాడారు. సర్వేల విషయంలోనే తాను అసంతృప్తికి గురయ్యాయన్నట్లుగా గంటా మాట్లాడటంతో.. ముఖ్యమంత్రి సర్దిచెప్పారు. సర్వేలను ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలి కానీ మనసులో పెట్టుకోకూడదని సూచించారు. దాంతో గంటా మెత్తబడ్డారు. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు అంగీకరించారు.
నిజానికి కేబినెట్ భేటీకి గంటా శ్రీనివాస్ రాకపోయినా.. ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోలేదు. సహచర మంత్రులు గంటాను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. పైగా.. ముఖ్యమంత్రి విశాఖకు వస్తున్న సమయంలో తాను బెంగళూరు వెళ్తున్నట్లు మీడియాకు సమాచారం కూడా ఇచ్చారు. దాంతో గంటా శ్రీనివాస్ టీడీపీతో తెగదెంపులు చేసుకోవడానికే సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం..ఇప్పటికి గంటాను బుజ్జగించాలనే నిర్ణయించారు. పార్టీ నేతలను గంటా ఇంటికి పంపారు. దాంతో సమస్య ఇప్పటికి పరిష్కారం అయిందనిపించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో గంటా శ్రీనివాస్ పాల్గొన్నంత మాత్రాన.. సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని… వాటి మధ్య లెక్కలు కుదరాలంటే..చాలా పెద్ద కసరత్తే జరగాల్సి ఉంటుందన్నారు. వీటిలో గంటానే కీలకం. గంటాను చంద్రబాబు ఎలా ట్యూన్ చేస్తారో.. దానికి గంటా ఎలా స్పందిస్తారన్నదానిపై.. మిగతా విశాఖ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు.