తెలంగాణ అధికార వర్గాల్లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది! అదేంటంటే, మియాపూర్ భూదందాకు సంబంధించిన వివరాల గురించి! మియాపూర్ భూకుంభకోణాన్ని తామే బయటకి తెచ్చామనీ, భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడామనీ, అక్రమార్కులపై కేసులు నమోదు చేశామనీ, మియాపూర్ ప్రాంతంలో ఒక్క గజం భూమి కూడా పోలేదంటూ ఆ మధ్య కేసీఆర్ చెప్పారు. ఇక, ఈ వివాదంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. గవర్నర్ తోపాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రతిక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేశాయి. అయితే, ఇదే తరుణంలో మంత్రి హరీష్ రావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మియాపూర్ భూదందాలో కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఫైళ్లు తమ దగ్గర ఉన్నారనీ, వారి జాతకాలన్నీ త్వరలోనే బయటపెడతామంటూ చెప్పారు. అయితే, ఆ మాటలు చెప్పి దాదాపు నెల దాటుతున్నా మంత్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోతుండటంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ, మంత్రి హరీష్ రావు దగ్గర నిజంగానే ప్రతిపక్ష నేతల జాతకాలు ఉన్నాయా, ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదనేదే ఇప్పుడు ప్రశ్న..?
నిజానికి, మియాపూర్ భూకుంభకోణం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్నే ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని తిప్పికొట్టడం కోసమే హరీష్ రావు ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు! ప్రతిపక్షాల నోళ్లు మూయించడం కోసమే తమ దగ్గర ఏవో ఆధారాలున్నాయనే బిల్డప్ ఇచ్చినట్టు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇంకో అభిప్రాయం కూడా ప్రచారంలోకి వస్తోంది! అదేంటంటే.. ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది నాయకుల జాతకాలు వారి గుప్పిట్లో ఉన్నమాట వాస్తవమేననీ, వాటిని అవసరమైనప్పుడు, తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకునేందుకు అధికార పార్టీ వ్యూహం అని కూడా అంటున్నారు!
ఏదేమైనా, ఒక కుంభకోణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన మంత్రి చెప్పడం సంచలనమే. అయితే, వాటిని బయటపెట్టకుండా, నాయకులను బెదిరించడానికో, లేదా వేరే రాజకీయ ప్రయోజనం కోసమే మియాపూర్ కుంభకోణం వివరాల పేరుతో డ్రామా చేయడం సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నిజానికి, ఇప్పుడు డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత మియాపూర్ కుంభకోణం గురించి పెద్దగా ఎవ్వరూ స్పందించడమే లేదు. ఆ మధ్య కొన్ని కారు నంబర్లు.. గోల్డ్ ప్రసాద్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రముఖులూ అంటూ కొంత హడావుడి నడించింది. కానీ, ఇప్పుడంతా చప్పబడిపోయింది. ఈ విషయమై ఇప్పుడు జరుగుతోందో కూడా పెద్దగా బయటకి రావడం లేదు! తమపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని తప్పించుకోవడం కోసమే ఇలాంటి తప్పుడు ప్రకటనలు సాక్షాత్తూ మంత్రులే చేస్తుంటే ఏమనుకోవాలి..?