తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి తగ్గిపోయిందని ఆయన మాట చెల్లడం లేదని విస్తృత ప్రచారం చేస్తున్నాయి ఇతర పార్టీలు. కాంగ్రెస్ లోని ఓ వర్గం కూడా ఈ విషయంలో ముందు ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మరోసారి ఈ చర్చ ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించాలని గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. దీన్నే సాక్ష్యంగా చూపించి రేవంత్ రెడ్డి మాట చెల్లడం లేదని ప్రచారం మరింతగా చేస్తున్నారు.
బీసీ ఉద్యమం కారణం.. కులగణన చేసి వారికి జనాభా పరంగా అవకాశాలు కల్పిస్తామని ప్రచారం చేస్తున్నందున ఈ సారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా నరేందర్ రెడ్డి పేరు పక్కకుపోయింది. అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి మనిషి అని పక్కన పెడుతున్నారని గతంలో ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు ఆయన మనిషి కాదని అందుకే అవకాశం ఇచ్చారని అంటున్నారు. దయాకర్ కు పదవికోసం రేవంత్ చాలా సార్లు ప్రయత్నించారు. ఇప్పుడు సక్సెస్ అయ్యారు.
ఇక జానారెడ్డి తన పలుకుబడితో శంకర్ నాయక్ కు చాన్స్ ఇప్పించారు. రాములమ్మ నేరుగా హైకమాండ్ తో మాట్లాడి తన పదవిని ఖరారు చేసుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పేర్లను సిఫారసు చేయడం.. తిరస్కరించడం అనేది ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏం జరిగినా రేవంత్ కు వ్యతిరేకంగా అన్వయించే రాజకీయం నడుస్తూండటంతో ఇలాంటి ప్రచారాలు పెరుగుతూనే ఉన్నాయి.