ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బడ్జెట్ ప్రసంగం జరుగుతోంది. ఈ సమావేశాలను కూడా ప్రతిపక్ష పార్టీ వైకాపా బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకూ సభకు వచ్చేది లేదని ఇప్పుడు కూడా భీష్మించుకుని కూర్చున్నారు ప్రతిపక్ష నేత జగన్. గత శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కాకపోవడంతో కీలకాంశాలైన పోలవరం, కాపుల రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చలకు దూరమయ్యారు. ఇప్పుడు కూడా విభజన చట్టం, కేంద్రం హామీలపై అత్యంత కీలకమైన చర్చకు ఆస్కారం ఉన్న సమయం. అయినాసరే, సభకు వచ్చేందుకు వైకాపా అధినేత జగన్ సిద్ధంగా లేరు. కేవలం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మాత్రమే వస్తారట.
ప్రత్యేక హోదా సాధనకు వైకాపా కూడా పోరాటం చేస్తోంది. ఎంపీలు రాజీనామాలకు సిద్ధమంటున్నారు, భాజపా సర్కారుపై అవిశ్వాస తీర్మానం అంటున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తున్నాం అనుకున్నప్పుడు… అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మరింత బాగుంటుంది కదా. సరిగ్గా ఇదే అభిప్రాయం వైకాపాలో కొంతమంది నాయకులకు ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విభజన చట్టం గురించి సభలో చర్చ జరుగుతోందనీ, ఇంకోపక్క బడ్జెట్ చర్చ కూడా ఉంటుందని, కాబట్టి సమావేశాలకు హాజరైతే మన స్వరాన్ని మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందనే ప్రతిపాదనను తాజాగా కొంతమంది నేతలు జగన్ ముందుకు పెట్టారట. అయితే, తాను ఒకసారి నిర్ణయం తీసుకుంటే మాట తప్పనని జగన్ సూటిగా చెప్పేశారట. ఇకపై ఈ చర్చ అనవసరం, ఏది ఉన్నా నేరుగా ప్రజల్లో మాట్లాడుకుందాం అని చెప్పినట్టు తెలుస్తోంది.
జగన్ మాట తప్పరు.. సరే! కానీ, ఇప్పుడున్న పరిస్థితిలో ఏది ప్రాధాన్యతాంశం అనే విశ్లేషణ చేసుకోవాలి కదా. ఫిరాయింపులపై పోరాటం కచ్చితంగా చేయాల్సిందే. కానీ, దానికంటే ప్రాధాన్యత గల అంశం ప్రత్యేక హోదా. వైకాపా కూడా ఆ దిశగా పోరాటం చేస్తోంది కాబట్టి, అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మరింత అర్థవంతంగా ఉంటుంది. కేంద్రం తీరుకు నిరసనగా అసెంబ్లీలో మాట్లాడితే.. ప్రజలకు మరింత చేరువ అవుతుంది. జగన్ పాదయాత్రలో ఉన్నారు, కొంతమంది నేతలు ఢిల్లీలో ఉన్నారు. ఏపీ ప్రజల దృష్టంతా ఇప్పుడు అసెంబ్లీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా ఉంది. ఇలాంటప్పుడు, వైకాపా గొంతు ప్రజలకు వినిపించాలంటే సభలో మాట్లాడటమే సరైన వ్యూహం. అది కూడా ఆలోచించడం లేదా..? సభకు వెళ్లకూడదన్న జగన్ నిర్ణయంపై వారి పార్టీలోనే ఉన్న భిన్నాభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు..? మాట తప్పుతామన్న అపప్రద వచ్చేస్తుందేమో అని మాత్రమే జగన్ ఆలోచిస్తున్నారేమో..! ఈ క్రమంలో ప్రతిపక్షంగా వారి కర్తవ్యాన్ని తప్పుతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనే సంగతి పట్టించుకోవడం లేదు.