పాపం… స్టార్ కమెడియన్‌గా వెలుగొందిన బ్రహ్మానందం పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. ఆయనకు సినిమాలు బాగా తగ్గిపోయాయి. చేసిన సినిమాల్లోనూ అర కొర పాత్రలే దక్కుతున్నాయి. తాజాగా విడుదలైన `నేల టికెట్టు` చూస్తే బ్రహ్మానందం దుస్థితి అర్థమవుతుంది. జూనియర్ ఆర్టిస్టు కంటే దారుణమైన పాత్ర ఇచ్చాడు కల్యాణ్ కృష్ణ. ఫృథ్వీ సీన్లో.. వెనుక నిలబడి – కొన్ని పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న బ్రహ్మీని చూస్తే.. `బ్రహ్మానందం ఇలాంటి పాత్రలకు కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చేశాడా` అనే అనుమానం కలుగుతుంది. ఈ సినిమా మొత్తం బ్రహ్మానందానికి ఇచ్చిన డైలాగులు ఒకటో, రెండో. అది కూడా `పోన్లే.. పాపం` అంటూ జాలి పడి ఇచ్చినట్టుంది.
అయితే… ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఓ రివైంజ్ డ్రామా నడిచినట్టు టాలీవుడ్ టాక్. కల్యాణ్ కృష్ణ తొలి సినిమా `సోగ్గాడే చిన్ని నాయిన`లో బ్రహ్మానందం ఓ కీలక పాత్ర చేశాడు. ఆ పాత్ర నిడివి, దర్శకుడు దానికి ఇచ్చిన ప్రాధాన్యం ఎక్కువే. అయితే కల్యాణ్ కృష్ణకు అదే తొలి సినిమా. దాన్ని అదునుగా తీసుకుని బ్రహ్మానందం కల్యాణ్ కృష్ణని తెగ ఆడేసుకున్నాడట. ఆ సినిమా జరుగుతున్నన్ని రోజులూ కల్యాణ్‌ని బ్రహ్మీ నానా హింసలకూ గురి పెట్టాడట. చెప్పిన టైమ్‌కి షూటింగ్‌కి రాకపోవడం, ఇచ్చిన డైలాగ్‌ని తనకు నచ్చినట్టు చెప్పడం – ఏమైనా అడిగితే `నాకే ఎదురు చెబుతావా` అన్నట్టు చూడడం.. ఇవన్నీ కల్యాణ్ కృష్ణ మనసులతో పెట్టేసుకున్నాడట. అందుకే బ్రహ్మానందంపై తన రివైంజు తీర్చుకోవడానికే.. తనని కావాలని ఈ సినిమాలో పెట్టుకుని, జూనియర్ ఆర్టిస్టు కంటే దారుణమైన పాత్ర ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బ్రహ్మానందంపై కొన్ని సీన్లు చేశారని అయితే.. వాటిని ఫైనల్ ఎడిట్‌లో కట్ చేసేశారని టాక్. అలా.. బ్రహ్మానందంపై తన కసి తీర్చుకున్నాడు. కానీ సినిమా పోయిందిగా పాపం?! దర్శకుడిపై ఆర్టిస్టుకి కోపం వచ్చినా, ఆర్టిస్టుపై దర్శకుడికి కోపం వచ్చినా అది సినిమాకే నష్టం. పోయేది నిర్మాతే. ఈ నిజాన్ని నవతరం దర్శకులు ఎప్పుడు తెలుసుకుంటారో?