తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయికి వెళ్తోంది. కేసీఆర్ ఆ పట్టుదలతోనే ఉన్నారు. కానీ ద్వితీయ శ్రేణి నేతల్లో నెలకొన్న అసంతృప్తిని మాత్రం కేసీఆర్ గుర్తించడం లేదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అటు పార్టీ పదవులు కానీ ఇటు నామినేటెడ్ పోస్టులు కానీ భర్తీ చేయడం లేదు. వీటి కోసం ఎదురు చూసి చాలా మమంది నిరాశకు గురవుతున్నారు. గత ఏడాది చివరిలో పార్టీ ప దవుల భర్తీ అంటూ హడావుడి చేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లా కమిటీ, డివిజన్ కమిటీలను నియమించారు కానీ రాష్ట్ర కమిటీని మాత్రం పెండింగ్ లో పెట్టింది. ప్లీనరీ చేశారు కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించలేదు.
పార్టీ పదవుల తరహాలోనే నామినేటెడ్ పదవులను నియమిస్తామని కొన్ని ప్రకటనలు చేసింది. కొంత మందికి పదవులు ఇచ్చింది. దాదాపుగా ఇరవై మంది నేతలకు ఈ పదవులు ఇచ్చింది. కానీ హఠాత్తుగా అన్ని నియామకాలు నిలిపివేసారు. తమకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశ పడిన వారికి నిరాశే ఎదురయింది. పదవులపై పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా కేసీఆర్ ప్రకటన చేయలేదు. దీంతో ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండదేమోనని అంతా భావిస్తున్నారు .
ఆదినుంచి పార్టీ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులకు సైతం గుర్తింపు దక్కడం లేదని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. పార్టీ క్యాడర్లోఇంత అసంతృప్తి పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఇబ్బందికరమని.. కేసీఆర్ ఏదో ఒకటి చేసి ఉత్సాహం తీసుకురావాలని .. నేరుగా హైకమాండ్‌కు సూచనలు పంపుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ అధినేత స్పందిస్తారో లేదో మరి !