తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. తెలంగాణకు చెందిన చాలా విషయాలను ఆయన .. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కానీ అత్యంత ముఖ్యమైన ముస్లిం రిజర్వేషన్ల బిల్లు విషయాన్ని మాత్రం కేసీఆర్ మర్చిపోయారు. ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి … దాని కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి.. బిల్లును కేంద్రానికి పంపారు. అవి మతపరమైన రిజర్వేషన్లు కావని… కొత్తగా ఇస్తున్నవి కూడా కాదని వాదించారు. ముస్లిం రిజర్వేషన్లు ఆమోద ముద్ర వేయకపోతే.. ఢిల్లీలోనే తేల్చుకుంటామన్నారు. అంతేనా… గత పార్లమెంట్ సమావేశాల్లో… టీఆర్ఎస్ సభను సగం రోేజుల పాటు అడ్డుకుంది. దానికి చెప్పిన కారణం.. ముస్లిం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయకపోవడం. అంత తీవ్రంగా ఆందోళన చేసిన టీఆర్ఎస్ హఠాత్తుగా ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ జోన్ల గురించి.. కాళేశ్వరం గురించి ప్రధానికి చెప్పారు కానీ… ముస్లిం రిజర్వేషన్ల గురించి … కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లు గురించి చెప్పలేదు.
నీతి ఆయోగ్ సమావేశంలో విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు… సమాఖ్య వ్యవస్థను నరేంద్రమోదీ నిర్వీర్యం చేస్తున్న తీరును… ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఆయా రాష్ట్రాల కారణాలు వాటికి ఉన్నాయి. కేసీఆర్ కూడా వారి బాటలో నడవాలంటే… ఆయనకూ ఓ కారణం ఉంది. అదే ముస్లిం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయడం. రిజర్వేషన్ల విషయాన్ని రాష్ట్రాలకు వదలేయాలని గట్టిగా వాదిస్తున్న కేసీఆర్… ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల సమావేశంలో లేవనెత్తుతారా లేదా అన్నది కీలకాంశంగా మారింది. ప్రధానితో భేటీలో ఎలాగూ.. ముస్లిం రిజర్వేషన్ల బిల్లు గురించి చెప్పలేదు.. అలాగే… నీతి ఆయోగ్ సమావేశంలోనూ లేవనెత్తకపోతే.. కేసీఆర్ అడుగులపై అనుమాన మేఘాలు పడటం ఖాయం.
కొద్ది రోజుల నుంచి బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ అధినేత రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆ పార్టీ ఏం చెబితే అది చేస్తున్నారన్న అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో… బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నించడం లేదు. అంటే బీజేపీని కానీ..మోదీని కానీ ఆయన ఏ మాత్రం ఇబ్బంది పెట్టకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఫెడరల్ ఫ్రంట్ కూడా.. కాంగ్రెస్ వైపు వెళ్లుకండా ప్రాంతీయ పార్టీలను ఆపేందుకు … బీజేపీ అండతో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలుగా కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. వరుసగా మారుతూ వస్తున్న పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తాయి. నీతి ఆయోగ్ సమావేశంలోనూ కేసీఆర్ సైలెంట్‌గా ఉంటే… నిజమేనని ప్రజలు అనుకునే అవకాశం కూాడా ఉంది.