టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ కోసం చర్చలు జరిపేందుకు భువనేశ్వర్ వెళ్లారు. ఆ ఫ్రంట్ గురించి ఎంత ప్రముఖంగా చర్చించారో కానీ.. ఏపీకి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్‌పై మాత్రం.. తమ అభిప్రాయాలు కలబోసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంపై.. కేసీఆర్‌తో చర్చించినట్లు… నవీన్ పట్నాయక్ మీడియాతో వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్ ముంపు విషయంలో.. ఒడిషా, చత్తీస్ ఘడ్ లతో… కొన్ని వివాదాలున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నాయని.. గిరిజన ప్రాంతాలు నీట మునుగుతున్నాయని.. అలాంటి చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని.. రకరకాల కారణాలు చెబుతూ.. ఒడిషా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను నిలిపి వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టులో కేసులు వేసి పోరాడుతోంది.
అదే సమయంలో కేంద్రానికి పదే పదే ఫిర్యాదులు చేస్తూ పోతోంది. ఒడిషా ప్రభుత్వం కోర్టుల్లో వేసిన పిటిషన్ల వల్ల… ఏడాదికోసారి.. పోలవరం నిర్మాణం కొనసాగించడానికి అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్రంతో.. సత్సంబంధాలు ఉన్నంత కాలం… ఈ విషయంలో ఇబ్బంది రాలేదు. కానీ క్రితం సారి.. గడువు ముగిసిపోయిన తర్వాత… నిర్మాణ పనుల పొడిగింపు ఉత్తర్వులు కేంద్రం ఇవ్వలేదు. పనులు ఆగిపోయిన పరిస్థితి వచ్చి.. తీవ్ర దుమారం రేగినప్పుడు.. ఇచ్చింది. అదే సమయంలో.. తెలంగాణలో ఏడు మండలాలను.. తీసుకున్నారని.. కేసీఆర్ తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ ఏడు మండలాలు తమకు ఇవ్వాలని.. పార్లమెంట్లో అవసరం వచ్చినప్పడల్లా.. ఆపార్టీ ఎంపీలు నినదిస్తూ ఉంటారు. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా ఏం చేయాలన్నదానిపై… ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నిరకంగా దక్కిన ఒకే ఒక్క ప్రయోజనం పోలవరం ప్రాజెక్టే.
ఆ పనులు చేపట్టే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి ఇవ్వడంతో… రేయింబవళ్లు కష్టపడి పనులు పరుగులు తీయిస్తున్నారు. ఒక్క సారి ప్రాజెక్టు పనులు ఆగిపోతే.. ఇక సాగవన్న ఆందోళనతో.. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు రీఎంబర్స్ చేయకపోయినా.. ఎలాగోలా… ముందుకు నడిపిస్తున్నారు. అందుకే.. కేసీఆర్, నవీన్ పట్నాయక్‌లు పోలవరంపై చర్చించారంటే.. ఏపీలో టెన్షన్ ప్రారంభమవుతోంది.