కర్నూలు జిల్లా పర్యటనలో లోకేష్ అనూహ్యంగా… కర్నూలు పార్లమెంట్, కర్నూలు అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ విషయంపై టీడీపీలో చాలా గందరగోళం ఉంది. 2014లో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున టీజీ వెంకటేశ్ పోటీ చేశారు. ఓడిపోయారు. తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడా సీటు నుంచి తన కుమారుడు టీజీ భరత్‌ను నిలబెట్టాలనుకుంటున్నారు. కానీ వైసీపీ తరపున గెలిచిన.. ఎస్వీ మోహన్ రెడ్డి… తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కర్నూలు టీడీపీలో వర్గపోరు ప్రారంభమయింది.
ఎవరు గెలుస్తారో.. వారికే చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని.. సర్వేలు చేయించుకుని.. నిర్ణయం తీసుకుంటారని.. టీజీ వర్గీయులు చెబుతూ వస్తున్నారు. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి. బైక్ ర్యాలీలు నిర్వహించాయి. అయితే మంత్రి లోకేష్ అభ్యర్థులను బహి రంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది. టీజీ వెంకటేష్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది.. ఎస్వీ మోహన్ రెడ్డికి రూట్ క్లియర్ చేయాడానికేనన్న ప్రచారం మొదట్లో సాగింది. అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు.
లోకేష్ నిర్ణయంతో టీజీ వెంకటేష్ అసంతృప్తికి గురయ్యారు. టీజీ వెంకటేశ్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? అన్న చర్చ జరుగుతోంది. టీజీ భరత్‌ను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యనాయకులు ఇప్పటికే రాజ్యసభ సభ్యు డు టీజీ వెంకటేశ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు కర్నూలు లో ప్రచారం ఊపందుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన తనయుడు టీజీ భరత్‌ను రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయించాలనే పట్టుదలతో టీజీ వెంకటేష్ ఉన్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.