బేటీ బచాలో బేటీ పఢావో. ఎంతో మంచి లక్ష్యంతో తలపెట్టిన ఈ పథకాన్ని ప్రధాని మోడీ హర్యానాలో ప్రారంభించారు. ఇప్పుడు అదే హర్యానాలో ఓ 21 ఏళ్ల యువతి దారుణ మానభంగానికి గురై న్యాయం కోసం ఆక్రోశిస్తోంది. ఆనాడు మోడీ పక్కన నిలబడి బేచీ బచావో బేటీ పఢావో కార్యక్రమ ప్రారంభోత్సవంలో కనిపించి బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పుడు ముఖం చాటేశారు.
మూడేళ్ల క్రితం ముగ్గురు అగ్రవర్ణ యువకుల చేతిలో ఓ దళిత యువతి అత్యాచారానికి గురైంది. రోహ్ తక్ సమీపంలోని భివానిలో ఈ ఘటన జరిగింది. ఆ కేసులో నిందితులు అరెస్టయ్యారు. అప్పటి నుంచీ కేసు వాపస్ తీసుకోవాలని, కోర్టు బయట టిల్ మెంట్ చేసుకోవాలనీ బాధితురాలి కుటుంబం మీద నిందితుల తరఫు వారు ఒత్తిడి తెస్తున్నారు. దోషులకు శిక్ష పడాల్సిందే తప్ప, రాజీ ప్రసక్తే లేదని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో ఆ రేపిస్టులకు కోపం ఎక్కువైంది.
ఇటీవల బెయిలుపై విడుదలైన ముగ్గురు రేపిస్టుల్లో ఇద్దరు మరోసారి ఆ యువతిపై అత్యాచారం చేశారు. రోహ్ తక్ లోని తన కాలేజీ ముందు నిలబడి ఉన్న ఆ యువతిని, మరో ముగ్గురు స్నేహి తులతో కలిసి కారులో కిడ్నాప్ చేశారు. ఆమెకు ఏదో మత్తు పానీయం తాగించి అత్యాచారం చేశారు. హింసించారు. కేసు వాపస్ తీసుకోక పోతే మళ్లీ రేప్ చేస్తామని, తండ్రిని, తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. తర్వాత బాధితురాలిని చంపబోయారు. అలా అయితే కేసు పెద్దది అవుతుందని ఓ స్నేహితుడు చెప్పడంతో, చివరకు ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
ఆ మార్గంలో వెళ్తున్న కొందరు స్థానికులు చూసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. రేపిస్టుల కర్కశత్వం వల్ల ఆ యువతి లేచి నిలబడలేని స్థితిలో ఉంది. ఇంత జరిగినా, ఆమె అత్యాచారానికి గురైందనడానికి ఆధారాలు లేవంటూ పోలీసులు పట్టించుకోలేదు. ఈ విషయం మీడియాలో హైలైట్ కావడం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ఆరు రోజుల తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.
రేపిస్టులు ఆ యువతిని శారీరకంగా హింసిస్తే, పోలీసులు మానసికంగా వేధించారు. రేప్ కు ఆధారం ఏదని ప్రశ్నించడంతో, కదలలేని స్థితిలో ఉన్న ఆ యువతి బిత్తర పోయింది. ఇంత జరుగుతున్నా, ముఖ్యమంత్రి మాత్రం దీనిపై స్పందించడం లేదు. కనీసం బయట కనిపించడం లేదు. రేపిస్టులు హర్యానాలో తిరుగులేని అగ్రవర్ణానికి చెందిన వారని, కాబట్టి ఆ వర్గం ఓట్లు దూరమవుతాయనే భయంతోనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. మరి ఇది నిజమో కాదో ముఖ్యమంత్రి చెప్పాలి.
తన పార్టీకి చెందిన ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ప్రధాని మోడీ పట్టించుకోక పోవడం ఆశ్చర్యకరం. గత ఆరురోజులుగా ఎక్కడా ఈ ఘటన ప్రస్తావన లేదు. కనీసం ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని మందలించినట్టు గానీ, బాధితురాలిని అవమానించిన పోలీసులపై చర్య తీసుకుని నిందితులను అరెస్టు చేయించాలని గానీ చెప్పినట్టు మీడియాలో ఎక్కడా రాలేదు. మోడీ చెప్పే బేటీ బచావో బేటీ పఢావో బూటకమని బాధితురాలి తల్లి ఆక్రోశం వెళ్లగక్కింది. ఆమె ఆవేదను అర్థం ఉంది.
మహారాష్ట్రలో మరో ఘటన జరిగింది. అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో ఓ 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు దళిత యువకులు ఆమెపై అత్యాచారం చేసి, హింసించి హత్య చేశారు. ఇది జరిగి ఐదు రోజులైనా పోలీసులు పట్టించుకోక పోవడంపై నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల బంద్ పాటించారు. మీడియాలో ఈ వార్త ప్రముఖంగా ప్రసారమైంది. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోనూ బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇలా జరుగుతోందేమిటి?
బేటీ బచావ్ బేటీ పఢావో అంటే ఇదేనా మోడీజీ? ప్రధానిగా మీకు చాలా పనులు ఉండొచ్చు. అయినా మీ పార్టీ పాలనలోని రాష్ట్రాల్లో సామూహిత అత్యాచారాలు జరిగినా నిందితులను అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కించడం సబబేనా? మీరూ మీ పార్టీ వారూ మానవత్వం మర్చిపోయారా అని జనం ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తారు?